కలం, వెబ్ డెస్క్: హుజురాబాద్ (Huzurabad)లో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా మంగళవారం నిరాహార దీక్ష చేయబోతున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) ప్రకటించారు. కరీంనగర్, వరంగల్, హన్మకొండ జిల్లాల నుంచి చెత్తను సేకరించి హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డులో (Dumping Yard) విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అయితే దీనిపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఎక్కడెక్కడి నుంచో చెత్త తీసుకొచ్చి మా దగ్గర వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. స్థానికంగా పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బంద్ కూడా నిర్వహించారు. అన్ని పార్టీల నాయకులు ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు.
ఇక తాజాగా అఖిల పక్షం ఆధ్వర్యంలో పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) 24 గంటల నిరాహార దీక్ష చేయనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకు దీక్ష చేస్తానన్నారు. హుజురాబాద్‌లోని 107 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలిటీల్లోని 60 వార్డుల్లో ఉన్న ప్రజలంతా తన దీక్షకు తరలిరావాలన్నారు. డంపింగ్ యార్డ్ అనేది కరోనా వైరస్ కంటే కూడా ప్రమాదకరమని కౌశిక్ రెడ్డి అన్నారు. శాంతియుతంగా, ట్రాఫిక్‌కు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరసన వ్యక్తం చేద్దామని పిలుపునిచ్చారు. డంపింగ్ యార్డ్ విషయంలో ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ప్రభుత్వానికి స్వరం వినిపించాలని సూచించారు.
Read Also: ప్రియుడితో జంప్.. పోలీసుల ముందే భార్యను కడతేర్చిన భర్త
Follow Us On: Pinterest

