ఏపీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు

కలం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సాగుతున్న ఒక భారీ ఉగ్రవాద కుట్ర (Major Terror Plot)ను ఏపీ పోలీసులు ఛేదించారు. ఐసిస్ (ISIS), ఆఖిస్ (AQIS) వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న “అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్” (Al Malik Islamic Youth) కుట్రలను ఇంటెలిజెన్స్, ఎన్టీఆర్ జిల్లా పోలీసులు భగ్నం చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఏపీ పోలీసులు దేశంలోని ఆరు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి ఇప్పటివరకు 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో మహ్మద్ రహ్మతుల్లా షరీఫ్, డానిష్, సోహైల్ బాగ్ అనే ముగ్గురు కీలక నిందితులను మొదట అరెస్ట్ చేశారు. వీరిచ్చిన సమాచారంతో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, రాజస్థాన్ (జోధ్‌పూర్), పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాల్లో మిగిలిన వారిని పట్టుకున్నారు.

‘ఖవాతీన్’ పేరుతో మహిళా విభాగం..

పోలీసులు నిర్వహించిన ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించారు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న హ్యాండ్లర్లు భారతదేశంలో విధ్వంసం సృష్టించడానికి ‘ఖవాతీన్’ (Khawateen) పేరుతో ఒక ప్రత్యేక మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయాలని పథకం వేసినట్లు తెలిపారు. ఈ విభాగానికి హైదరాబాద్‌లోని చంచల్‌గూడకు చెందిన సయీదా బేగం అనే మహిళ నాయకత్వం వహిస్తున్నట్లు గుర్తించి ఆమెను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఉగ్ర ముఠాకు విధ్వంసకర శిక్షణ ఇచ్చి దేశంలో అల్లకల్లోలం సృష్టించి దేశాన్ని నాశనం చేయాలనే ప్రణాళికలు పన్నారని తెలిపారు.

ముస్లిమేతరులే టార్గెట్..

ఈ ఉగ్ర ముఠాకు పాకిస్థాన్ నుండి ఆదేశాలు అందుతున్నాయని ఏపీ పోలీసులు తెలిపారు. రిక్రూట్ చేసుకున్న మహిళలకు స్నిపర్ రైఫిల్స్, తుపాకులు వాడటంలో శిక్షణ ఇవ్వడం ఇస్తారని వివరించారు.బ్లాక్ పౌడర్ బాంబులతో పాటు ఐఈడీ (IED) ల తయారీలో శిక్షణ ఇచ్చి దేశవ్యాప్తంగా దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ద్వారా దేశంలో అశాంతిని, భయాందోళనలను వ్యాపింపజేయాలని చూస్తున్నారని వెల్లడించారు. సోషల్ మీడియా గ్రూపుల ద్వారా యువతను తప్పుదోవ పట్టించి, తీవ్రవాద భావజాలాన్ని నూరిపోయాలని చూస్తున్నారని తెలిపారు.

కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు..

ఉగ్రకుట్రను (Major Terror Plot) ఛేదించిన పోలీసులు.. కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుండి పెద్ద ఎత్తున జిహాదీ సాహిత్యం, ఐఈడీల తయారీకి సంబంధించిన గైడ్లు, పాకిస్థాన్ హ్యాండ్లర్లతో జరిపిన చాటింగ్ వివరాలను సేకరించారు. విజయవాడ కేంద్రంగా ఒక యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా గ్రూపులను నడుపుతూ.. వీరు నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read Also: మావోయిస్టు పార్టీ కీలకనేత సోది కేశాలు లొంగుబాటు..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>