కలం, నల్లగొండ: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విడతలవారీగా పెంచుతూ సామాన్యులపై మోయలేని భారం మోపిందని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మండిపడ్డారు. నల్లగొండ జిల్లా సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10వ తేదీన కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇంధన ధరల పెంపు ప్రభావం అన్ని రంగాలపైనా పడిందని, ముఖ్యంగా ఎరువుల ధరలు పెరగడం వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ, అంబానీ వంటి బడా కార్పొరేట్లకు వేల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం.. సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని, కేంద్రానికి ప్రజల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా.. ప్రకటించిన హామీల్లో ఒకటి అర మినహా మిగిలిన ఏ ఒక్క పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయడంలో విఫలమైందని నెల్లికంటి సత్యం విమర్శించారు. గత ప్రభుత్వంపై నెపం నెడుతూ కాంగ్రెస్ తాను ఇచ్చిన వాగ్దానాలను విస్మరించడం తగదని, రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. రైతు భరోసా, రుణమాఫీ పథకాలను అరకొరగానే అమలు చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్లు, కళ్యాణలక్ష్మి వంటి పథకాల ఆర్థిక సాయాన్ని పెంచలేదన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి ముందుచూపు లోపించింది. భువనగిరి వంటి జిల్లాల్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున ధాన్యం మార్కెట్లలోనే మూలుగుతోంది. కొనుగోళ్ల పేరుతో రైతుల నుంచి 5-6 కిలోల వరకు తరుగు తీస్తూ నిలువునా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులు..
సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వానికి స్పష్టత లేదని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తెలిపారు. సొరంగ మార్గం, డిండి ఎత్తిపోతల, ఉదయసముద్రం ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని, ప్రాజెక్టులవారీగా టార్గెట్లు పెట్టుకుని పూర్తి చేయకపోతే రైతులకు ఫలితం దక్కదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో కమిటీల పెత్తనం ఎక్కువై అర్హులకు న్యాయం జరగడం లేదని, ఇళ్లు పూర్తయినా బిల్లులు చెల్లించడం లేదన్నారు. సింగిల్ విండోలకు నామినేషన్ పద్ధతిలో కాకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే ‘రైతు డిస్కమ్’ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు.
చిచ్చు పెట్టేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని నెల్లికంటి సత్యం హితవు పలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా, రైతు వ్యతిరేక విధానాలపై ఈ నెల 10వ తేదీన సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగే ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని రైతులు, సామాన్య ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు.

