Mobile Popup Ad
Mobile Popup Ad

శ్రీ ఆదిత్య బిల్డర్స్ వెనుక ఎంపీ.. తర్వలోనే పేరు బయటపెడుతా: కవిత

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వనరులు, సంస్కృతి, అస్తిత్వం కాపాడేందుకే తాము పార్టీ పెట్టామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత (Kavitha) స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రూ.లక్ష కోట్ల విలువైన భూమిని రేవంత్ సర్కార్ బడాబాబులకు కట్టబెడుతోందని ఆరోపించారు. సీఎం సోదరులు, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు బందిపోట్ల మాదిరిగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని.. వాళ్ల భూదందాలను వరుస బెట్టి ఆధారాలతో సహా బయటపెడతానని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి ఇదే ఆఖరి సర్కార్ అని.. 20 ఏళ్లు ఆ పార్టీని బొందపెట్టే పనులను రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రాణం పోయినా సరే తెలంగాణలో ఇంచు భూమిని దోపిడీ చేయనివ్వమని స్పష్టం చేశారు. ఆంధ్రా విష కోరల్లోంచి తెలంగాణను సాధించుకున్నామని.. కచ్చితంగా తెలంగాణ తమ జాగీరే అంటూ వ్యాఖ్యానించారు.

శ్రీ ఆదిత్య బిల్డర్స్ వెనుక ఒక ఎంపీ..

రూ.లక్ష కోట్ల భూములను పెద్ద వాళ్లకు అప్పనంగా అప్పగించేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని కవిత ఆరోపించారు. ఆ భూదందా గురించి సాక్ష్యాధారాలతో సహా వరుసగా చెబుతాననన్నారు. హైడ్రా అనే బూచి ద్వారా భూదందా ఎవరెవరూ చేస్తున్నారో ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. అప్పులు పుట్టం లేదంటూ ఉన్న భూములను అమ్ముకుంటూ పోతే భవిష్యత్ అవసరాలకు భూమి ఎట్ల? అంటూ ఫైర్ అయ్యారు. హైడ్రా అనే సంస్థ కూకట్ పల్లిలోని మంజీర కాలనీకి నిన్న కూడా వెళ్లి పేదల భూములను ఖాళీ చేయించిందని.. అదే మూసీ రివర్ బెడ్ లోనే కడుతున్న శ్రీ ఆదిత్య బిల్డింగ్ (Sri Aditya Builders)ను మాత్రం టచ్ చేయటం లేదని ఆరోపించారు.

గతంలో మేము ఆ బిల్డింగ్ వద్ద ధర్నా చేస్తే హైడ్రా వాళ్లు తమ మీద దాడి చేసే ప్రయత్నం చేశారని అన్నారు. కానీ తాము ఆధారాలు చూపించిన తర్వాత ఒక్క మాట మాట్లాడటం లేదని చెప్పారు. శ్రీ ఆదిత్య బిల్డర్స్ వెనుక ఒక ఎంపీ ఉన్నాడని.. ఆయన పేరు త్వరలోనే బయటపెడుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమవతిపేట పెద్ద చెరువులో ఏడు ఎకరాలను కబ్జా చేశారని.. 2023 నాటికి మరింత చొచ్చుకువచ్చారని అన్నారు. ఆ సంస్థను ముట్టుకునే దమ్ముందా? అని హైడ్రాకు సవాల్ విసిరారు. ఏడు ఎకరాలు అంటే ఏడు వంద కోట్ల విలువైన భూమి అని, దాని పైన 30 అంతస్తుల భవనం అంటే వేల ఎకరాల వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై కూడా కచ్చితంగా ఆధారాలతో సహా ఫిర్యాదు కూడా చేస్తామన్నారు.

బందిపోట్ల మాదిరిగా దోచుకుంటున్నారు..

తెలంగాణ వనరులను, సంపదను, భూములను బందిపోట్ల మాదిరిగా దోచుకునేందుకు గతంలో బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే కాంగ్రెస్ తలుపులు తెరిచిందని దుయ్యబట్టారు. అప్పుడు కేటీఆర్ పాలనే ఉందని.. ఇప్పుడూ కేటీఆర్ పాలనే ఉందని సెటైరికల్ కామెంట్స్ చేశారు. గతంలో కేటీఆర్ అంటే కేసీఆర్, తన్నీరు హరీష్ రావు, రామారావు అని.. ఇప్పుడు కేటీఆర్ పాలన అంటే కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. కచ్చితంగా తెలంగాణ వనరులను కాపాడుకుంటామన్నారు. తెలంగాణ భూములను రక్షించేందుకు భూపోరాటాలు చేస్తామని.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లైనా లీగల్ ఫైట్ చేస్తామని చెప్పారు. తెలంగాణలో రానున్న తరాల కోసం ప్రభుత్వ పెద్ద కోరల నుంచి భూములను కాపాడుతామన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>