కలం, వెబ్ డెస్క్ : సరదాగా మొదలైన ఆన్‌లైన్ గేమ్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయి. అప్పులు చేసి మరీ ఆన్‌లైన్ బెట్టింగ్ (Online betting)లు ఆడుతున్న యువత, అవి తిరిగి చెల్లించలేక ఒత్తిడికి లోనై తనువు చాలిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని దెబ్బడగూడ గ్రామంలో ఒక డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
దెబ్బడగూడ గ్రామానికి చెందిన విక్రమ్ (20) నారాయణగూడలోని బీజేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గత కొంతకాలంగా విక్రమ్ ఆన్‌లైన్ బెట్టింగ్ (Online betting) లకు అలవాటు పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సుమారు లక్ష రూపాయల వరకు డబ్బును బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు.
డబ్బులు నష్టపోవడంతో ఆ ఒత్తిడిని తట్టుకోలేక తన నివాసంలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. దెబ్బడగూడ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


