epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ఒకే కుటుంబం.. మూడు పార్టీలు.. ముగ్గురూ గెలిచారు!

కలం, వెబ్​డెస్క్​: మహారాష్ట్ర పుర ఎన్నికల (Maharashtra civic polls) ఫలితాల్లో విచిత్రం. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అభ్యర్థులు మూడు వేర్వేరు పార్టీల నుంచి గెలిచారు. ఇది దేశ ఎన్నికల చరిత్రలోనే అత్యంత అరుదైన సంఘటనల్లో ఒకటి. మాత్రే కుటుంబం ఈ అరుదైన రికార్డు సృష్టించింది. ఈ కుటుంబానికి చెందిన ముగ్గురు అభ్యర్థులు థానే మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల్లో వేర్వేరు పార్టీల నుంచి, మూడు వార్డుల్లో పోటీకి దిగారు. ఇందులో ప్రహ్లాద్​​ మాత్రే.. మహారాష్ట్ర నవనిర్మాణ్​ సేన(ఎంఎన్​ఎస్​) నుంచి, రేఖా మాత్రే.. శివసేన(షిందే), రవీణ్​ మాత్రే.. బీజేపీ నుంచి పోటీ చేశారు. అయితే, గెలిచినప్పటికీ ప్రహ్లాద్​ మాత్రేకి మాత్రం నిరాశే మిగిలింది. ఎందుకంటే థానె మున్సిపాలిటీని శివసేన, బీజేపీ కూటమి గెలుచుకుంది.

ఇలాగే మరో కుటుంబంలోనూ పోటీ చేసిన ముగ్గురూ గెలిచారు. ఇది కూడా మహారాష్ట్ర పుర ఎన్నికల్లో (Maharashtra civic polls) నే జరిగింది. కోలే కుటుంబానికి చెందిన లిఖిత్​, సింధూతయ్​, పీయూష్​ లలిత్​ ముగ్గురూ జల్​గావ్​ మున్సిపల్​ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచారు. అయితే, వీళ్లు ముగ్గురూ శివసేన తరఫునే గెలుపొందడం గమనార్హం. ఇందులో ఇంకో విచిత్రమేంటంటే లలిత్​ ఓ కేసులో జైలులో ఉన్నారు. అయినా, ఎన్నికల బరిలోకి దిగి గెలిచారు. లలిత్​ జైలు నుంచి విడుదలయ్యేంత వరకు చెప్పులు వేసుకోబోమని అతని కుటుంబం ప్రతిజ్ఞ చేయడం విశేషం.

గౌరీ లంకేశ్​​ హత్య కేసులో నిందితుడు..

‘మహా’ పుర ఎన్నికల్లో మరో ఫలితం అందరినీ షాకింగ్​కు గురిచేసింది. జర్నలిస్ట్​ గౌరీ లంకేశ్​ 2017లో బెంగళూరులో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో నిందితుడు శ్రీకాంత్​ పంగార్కర్​ గెలుపొందాడు. జాల్నా మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల్లో 13వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీకాంత్​​ విజయం సాధించాడు. బీజేపీ, ఇతర పార్టీల అభ్యర్థులందరినీ ఓడిస్తూ ఏకంగా 2,621 ఓట్ల మెజార్టీతో ​గెలుపొందాడు. ఫలితాల అనంతరం మద్దతుదారులతో కలసి సంబరాలు చేసుకున్నాడు. కాగా, ఈ స్థానంలో శివసేన(షిందే) తమ అభ్యర్థిని బరిలో దించలేదు. ఆ పార్టీ పరోక్షంగా శ్రీకాంత్​కు మద్దతు ఇచ్చిందని వినిపిస్తోంది. కారణం.. శివసేన చీలిపోకముందు ఆ పార్టీ తరఫున 2001–06లో జాల్నా మున్సిపల్​ కౌన్సిల్​కు పాంగార్కర్​ ఎన్నికయ్యాడు. 2011లో హిందూ జన జాగృతి సమితిలో చేరాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>