కలం, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) దేశ భక్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆయన చేసిన పనికి హ్యాట్సాఫ్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఓ కార్యక్రమంలో జాతీయ జెండా పట్ల ఆయన చూపిన గౌరవానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే దీనంతటికీ కారణం. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్‌లో నిర్వహించిన ఓ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన రిబ్బన్ జాతీయ జెండా రంగులైన తెలుపు, ఆకుపచ్చ, కేసరి రంగుల్లో ఉంది. దీంతో ఒమర్ అబ్దుల్లా ఈ రిబ్బన్‌ను కట్ చేయడానికి నో చెప్పారు. రబ్బన్‌ను స్వయంగా తానే జాగ్రత్తగా విప్పి నిర్వాహకులకు అప్పగించారు. ఈ రిబ్బన్‌ను ఎంతో గౌరవ స్థానంలో భద్రపరచాలని ఆయన వారికి సూచించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. జాతీయ జెండా రంగుల్లో ఉన్న రిబ్బన్‌ను కత్తిరించడం సరికాదని భావించిన అబ్దుల్లా హుందాతనాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి, సలహాదారు నాసిర్ అస్లాం వానీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

