Mobile Popup Ad
Mobile Popup Ad

డీలిమిటేషన్‌పై కేంద్ర మంత్రి నిర్మల కీలక కామెంట్స్

కలం, నేషనల్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన డీలిమిటేషన్‌పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు అవగాహన లేకుండానే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆమె మంగళవారం పూర్వ బర్దమాన్‌లో మీడియాతో మాట్లాడుతూ, నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ ఏకపక్షంగా సాగదని, అన్ని పార్టీలతో సంప్రదింపులు పూర్తయిన తర్వాత జరుగుతుందన్నారు. డీలిమిటేషన్ కమిషన్ నియామకమైన తర్వాత అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తుందన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య విభజన తీసుకొస్తుందని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్న వాదనల్లో అర్థం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే విపక్షాల నేతలు కొన్ని విమర్శలు చేస్తూ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని నిర్మలా సీతారామన్ ఆరోపించారు.

మహిళా రిజర్వేషన్ కోసం ఇంకెంతకాలం ఆగాలి? :

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్నది దీర్ఘకాల ఆకాంక్ష అని, దీన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ‘నారీ శక్తి వందన్ అధినియం’ చట్టాన్ని తీసుకొచ్చిందని నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గుర్తుచేశారు. ఈ చట్టం అమల్లోకి రావాలంటే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తికావాల్సి ఉంటుందన్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కోసం ఇంకెంతకాలం ఆగాలని ఆమె ఎదురు ప్రశ్నించారు. వెంటనే రిజర్వేషన్ అమల్లోకి వచ్చేలా, మహిళలకు రాజకీయంగా అవకాశాలు కల్పించేందుకే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ చట్టంతో పాటు డీలిమిటేషన్ కూడా పూర్తి చేయాలనుకుంటున్నామన్నారు. రిజర్వేషన్ల సాకుతో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే కుట్ర జరుగుతోందంటూ కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీల నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

సీట్ల సంఖ్య 850కు పెరగడంపైనా వివాదమేనా? :

ప్రస్తుతం లోక్‌సభలో 543 సీట్లు ఉన్నాయని, దానిని 850కి పెంచాలని ప్రతిపాదన ఉందని నిర్మలా సీతారామన్ గుర్తుచేశారు. రాష్ట్రాలకు 815 లోక్‌సభ స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించే అవకాశం ఉందన్నారు. ఈ సీట్ల సంఖ్య గరిష్ట పరిమితి మాత్రమేనని, తుది నిర్ణయాన్ని అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ప్రకటిస్తుందన్నారు. డీలిమిటేషన్‌ను అడ్డుకోవడం ద్వారా మహిళా రిజర్వేషన్లను కూడా అడ్డుకుంటున్నారని మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ ఆమె విమర్శలు చేశారు. ‘సర్’ ప్రక్రియతోనూ భయపడుతున్నారు, కేంద్ర ఎన్నికల సంఘానికీ భయపడుతున్నారు, పార్లమెంటులో చర్చలంటే భయపడుతున్నారు, ప్రభుత్వం బిల్లులు పెడుతున్నదంటే కూడా భయపడుతున్నారని విమర్శించారు. “బెంగాల్‌ను విభజించడానికే డీలిమిటేషన్ చేస్తున్నారు” అంటూ మమతా బెనర్జీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నిర్మలా సీతారామన్ ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>