కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్లో (Karimnagar) భగత్‌నగర్ రెడ్డి సంక్షేమ సంఘం నూతన భవన నిర్మాణం కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శుక్రవారం కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడారు. 2012లో స్థాపించబడిన తమ సంఘం భగత్‌నగర్, కట్టరాంపూర్, కార్తికేయనగర్, అయోధ్యకాలనీ తదితర ప్రాంతాల్లో విస్తరించి ఉందన్నారు. సుమారు 800 మంది సభ్యులతో కరీంనగర్ పట్టణంలోనే అతిపెద్ద రెడ్డి సంఘాల్లో ఒకటిగా సేవలందిస్తుందన్నారు.
శాశ్వత భవనం నిర్మించాలనే లక్ష్యంతో సభ్యుల సహకారంతో రామచంద్రాపూర్ కాలనీ రోడ్డు నెం. 21లో స్థలాన్ని కొనుగోలు చేశామని, సభ్యుల విరాళాలతో తొలి దశగా ఒక స్లాబ్ నిర్మాణం కూడా పూర్తి చేశామని వెల్లడించారు. అయితే మిగిలిన పనులు పూర్తి చేయడానికి అధిక వ్యయం అవసరమవుతుందన్నారు. ప్రభుత్వ నిధులు, అందుబాటులో ఉన్న పథకాల ద్వారా నిధులు మంజూరు చేయాలని యాదగిరి సునీల్ రావుని కోరారు.
ఈ భవన నిర్మాణం పూర్తయితే సామాజిక సమావేశాలు, విద్యార్థులు, యువత అభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలు, ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి ఉపయోగపడుతుందని వివరించారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు సానుకూలంగా స్పందించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళి, భవన నిర్మాణానికి సహకరిస్తానని భరోసా ఇచ్చారు.
వినతిపత్రం అందించినవారిలో భగత్‌నగర్ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు కసిరెడ్డి రాజి రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇంద్రా రెడ్డి, కోశాధికారి చెరుకుపల్లి కనకారెడ్డి, ఉపాధ్యక్షులు ముదుగంటి దామోదర్ రెడ్డి, సంది జలపతి రెడ్డి, సంయుక్త కార్యదర్శులు దేవసాని కిరణ్ కుమార్ రెడ్డి, కరివేద శ్రీనివాస్ రెడ్డి, ప్రచార కార్యదర్శి కాంతాల తిరుపతి రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఇనుకొండ సుధాకర్ రెడ్డి, కాసం ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.

