కలం, మహబూబ్ నగర్ బ్యూరో: “మన ఇల్లు – మన ఆరోగ్యం” కార్యక్రమంలో భాగంగా నారాయణపేట (Narayanpet) జిల్లా అధికారులందరూ తమ నివాసాల్లో దోమల వ్యాప్తికి అవకాశం లేకుండా పరిశుభ్రత చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక (Collector Priyanka) ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పూల కుండీలు, నీటి తొట్టిల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి, కార్యాలయ ఆవరణలో పరిశుభ్రత చర్యలు చేపట్టారు.
వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల దోమల లార్వా అభివృద్ధి చెంది, దోమల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దోమల నివారణకు ప్రతి శుక్రవారం జిల్లా అధికారులందరూ తమ తమ నివాసాల్లో “మన ఇల్లు – మన ఆరోగ్యం” కార్యక్రమాన్ని విధిగా నిర్వహించి, నీరు నిల్వ ఉండే ప్రదేశాలను పరిశుభ్రం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి, ప్రతి కుటుంబం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు.

