కలం, వెబ్ డెస్క్ : ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) మళ్లీ ట్రాక్‌పైకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. దోహాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్‌లో (Doha Diamond League 2026) ఆయన బరిలోకి దిగనున్నారు. అయితే ఈ టోర్నీలో పాల్గొనడంపై చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగింది. పోటీకి కొద్ది రోజుల ముందే తన ఎంట్రీని ఖరారు చేసిన నీరజ్, ఈ ఆలస్యానికి గల కారణాలను స్వయంగా వెల్లడించారు. గత ఏడాది టోక్యో వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో పూర్తి ఫిట్‌నెస్ లేకపోయినా ఆడటం సరైన నిర్ణయం కాదని భావించారు.
అప్పట్లో యాంకిల్ గాయం తర్వాత భుజం నొప్పులు రావడంతో ఈసారి మరింత జాగ్రత్తగా వ్యవహరించారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకోవడానికి స్విట్జర్లాండ్‌లోని మాగ్లింగెన్ ఒలింపిక్ ట్రైనింగ్ సెంటర్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన నీరజ్, ప్రశాంత వాతావరణంలో తన ఫిట్‌నెస్, టెక్నిక్‌పై దృష్టి సారించారు. కేవలం నెలన్నర క్రితమే మళ్లీ జావెలిన్ విసరడం ప్రారంభించిన ఆయన, పూర్తిగా సిద్ధమయ్యాకే పోటీలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.
తన ఫిట్‌నెస్‌ను పూర్తిగా పరీక్షించుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని డైమండ్ లీగ్ నిర్వాహకులను కోరగా, వారు కూడా అంగీకరించారు. చివరి ట్రైనింగ్ సెషన్ ముగిసిన తర్వాత అన్నీ బాగున్నాయనే నమ్మకం కలిగిన నీరజ్, చివరకు దోహా డైమండ్ లీగ్‌లో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు అందరి దృష్టి నీరజ్ ప్రదర్శనపై ఉంది. గాయాల తర్వాత తిరిగి బరిలోకి దిగుతున్న ఆయన, మరోసారి తన ప్రతిభను నిరూపిస్తాడా అన్న ఆసక్తి క్రీడాభిమానులలో నెలకొంది.

