కలం, వెబ్ డెస్క్: కనీస వేతనం కోసం ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని నొయిడాలో జరిగిన అల్లర్లు (Noida Violence) హింసాత్మక రూపం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్ల వెనుక పాకిస్థాన్ కుట్ర ఉండొచ్చని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ అల్లర్లను తమకు అనుకూలంగా రాజకీయ అస్త్రంగా మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది. యూపీలో మే- జూన్ నెలలో స్థానిక సంస్థలు జరగనున్నాయి. 2027 మే నాటికి అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ఆందోళనకారులకు మద్దతు తెలుపుతున్నాయి. దేశంలో యూపీ బీజేపీకి కంచుకోటగా ఉంది. ఆ రాష్ట్రంలో గెలిచే ఎంపీలే బీజేపీకి ఆయువుపట్టు.. దీంతో కార్మికవర్గాలను, వారి కుటుంబాలను తమవైపుకు తిప్పుకునేందుకు విపక్షాలు ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉండొద్దు అంటూ లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ పిలుపునివ్వడం గమనార్హం. సమాజ్‌వాద్ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సైతం ఉద్యోగులకు మద్దతు ఇచ్చారు.
ఆందోళనల వెనుక కారణాలు ఏమిటి?
ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు, చిరుద్యోగులు తమకు కనీస వేతనం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దాదాపుగా 40 వేల మంది కార్మికులు ఒకేసారి రోడ్డెక్కి తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. మొత్తం 80 ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. అద్దెలు, నిత్యావసరసరుకులు ధరలు పెరిగిన నేపథ్యంలో తమకు వేతనాలు పెంచాలన్నది వారి డిమాండ్.
రంగంలోకి రాహుల్, అఖిలేశ్ యాదవ్
నొయిడా అల్లర్లపై లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘నెలకు రూ.12,000 సంపాదించే కార్మికుడు, రూ.4,000 నుంచి రూ.7,000 వరకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి కార్మికులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలి’ అంటూ డిమాండ్ చేశారు. ‘బీజేపీ నేతలు ఈ ఘటనను కుట్ర అంటున్నారు. ఒక వేళ కుట్ర అయితే దానికి బాధ్యత అధికారంలో ఉన్న బీజేపీదే కదా’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయని, కానీ భారాన్ని సాధారణ కార్మికులే మోయాల్సి వస్తోందని అన్నారు. సమాజ్‌వాద్ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సైతం కార్మికులకు మద్దతు పలికారు.
యూపీ సర్కారు ఏమంటోంది?
యూపీ కార్మికశాఖ మంత్రి అనిల్ రాజ్‌భర్ ఈ హింస (Noida Violence) వెనుక పాకిస్తాన్‌కు సంబంధాలు ఉన్న కుట్ర” ఉందని ఆరోపించారు. పరిశ్రమల్లో కల్లోలం సృష్టించే వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. యజమానులు, కార్మికులు పరస్పరం చర్చలు జరపాలని సూచించారు. నోయిడా పోలీస్ కమిషనర్ లక్ష్మీ సింగ్ మాట్లాడుతూ.. ఇక్కడ పక్కా ప్రణాళికతోనే అల్లర్లు జరిగాయని చెప్పారు. ఇప్పటివరకు 300 మందికి పైగా అరెస్టు చేయగా, అగ్నిప్రమాదాలకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్ గ్రూపులు, క్యూ ఆర్ కోడ్‌ల ద్వారా పక్కా ప్లాన్ ప్రకారం కుట్రలు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. విదేశీ నిధులు కూడా వచ్చినట్టు అనుమానం వ్యక్తం చేశారు. ఈ అల్లర్ల వెనుక వామపక్షవాదులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆందోళనలు తీవ్ర తరం కావడంతో ప్రభుత్వం వేతనాల్లో స్వల్ప మార్పులు చేసింది. అసంఘటిత కార్మికులకు రూ. 13,690, నైపుణ్యం లేని కార్మికులకు రూ. 15,059, నైపుణ్య కార్మికులకు రూ. 16,868 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Read Also: బీహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి : రేపే ప్రమాణ స్వీకారం
Follow Us On: X(Twitter)

