కలం, స్పోర్ట్స్: పాకిస్థాన్‌తో క్రీడా సంబంధాలపై భారతదేశ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాయాదితో ద్వైపాక్షిక (India-Pak) సిరీస్‌ల నిషేధాన్ని కొనసాగించాలని నిశ్చయించుకుంది. కాగా అంతర్జాతీయ టోర్నీల కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. గతేడాది పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో నేరుగా ఆడే మ్యాచులపై కేంద్రం ఆంక్షలు విధించింది. తాజాగా క్రీడా మంత్రిత్వ శాఖ ఆ నిబంధనలనే మళ్ళీ ధ్రువీకరించింది. దీని ప్రకారం భారత జట్లు పాకిస్థాన్‌కు వెళ్లవు, అలాగే పాక్ జట్లను భారత్‌లో ఆడేందుకు అనుమతించరు.
అయితే, ప్రపంచ స్థాయి పోటీల్లో మాత్రం ఈ ఆంక్షలు వర్తించవు. ఒలింపిక్స్ లేదా ఆసియా కప్ వంటి బహుళ దేశాలు పాల్గొనే టోర్నీలలో భారత్, పాక్ జట్లు తలపడవచ్చు. ఒకవేళ భారత్ ఇలాంటి మెగా ఈవెంట్లకు ఆతిథ్యం ఇస్తే, పాకిస్థాన్ క్రీడాకారులు ఇక్కడకు వచ్చి ఆడేందుకు ఎటువంటి అభ్యంతరం ఉండదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
భారత్ (India)ను అంతర్జాతీయ క్రీడల అడ్డాగా మార్చడమే లక్ష్యంగా వీసా నిబంధనలను ప్రభుత్వం సులభతరం చేస్తోంది. విదేశీ క్రీడాకారులు, అధికారులు, సాంకేతిక నిపుణులకు త్వరగా వీసాలు అందేలా చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ క్రీడా సంస్థల అధికారులకు వారి పదవీకాలం ముగిసే వరకు లేదా గరిష్టంగా ఐదేళ్ల వరకు మల్టీ-ఎంట్రీ వీసాలను ప్రాధాన్యత ప్రాతిపదికన మంజూరు చేస్తారు. 2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్ క్రీడలను నిర్వహించాలని భారత్ పట్టుదలతో ఉంది. అందుకే ఒలింపిక్ నిబంధనలకు అనుగుణంగా అందరినీ కలుపుకుని పోయే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోంది.
Read Also: ఆర్చరీ వరల్డ్ కప్: చేజారిన పతకాలు!
Follow Us On: WhatsApp

