Mobile Popup Ad
Mobile Popup Ad

వ్యవసాయ రంగంలో తొలిమెట్టుగా పంటల మార్పు: కోదండ రెడ్డి

కలం, వరంగల్ బ్యూరో: వ్యవసాయ రంగంలో మార్పులకు తొలిమెట్టుగా పంటల మార్పిడి ఉండాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి (Kodanda Reddy) అన్నారు. బుధవారం హనుమకొండ (Hanumakonda) జిల్లా సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు రాష్ట్రస్థాయి ‘మెగా రైతు మేళా’ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బిడ్డగా రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారని తెలిపారు.

వ్యవసాయ రంగంలో సమగ్ర మార్పులు అవసరమని, పంటల మార్పిడి ద్వారా రైతులు లాభదాయక సాగు వైపు అడుగులు వేయాలని సూచించారు. రాష్ట్రంలో వరి, పత్తి పంటలపై అధికంగా ఆధారపడటం వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశముందని, ఉద్యాన, వాణిజ్య పంటల వైపు రైతులు మళ్లాలని అన్నారు.

కోతుల బెడదతో అనేక భూములు పాడవుతున్నాయని, చిన్న రైతుల కోసం ఫెన్సింగ్ సబ్సిడీ ప్రతిపాదనను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. రైతులు సంఘటితంగా ఉండి దళారుల దోపిడీకి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రసాయనిక ఎరువులు, ప్రమాదకర పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులకు మార్గదర్శనం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్లను ప్రోత్సహించడం ద్వారా రైతులకు మరింత లాభం కలుగుతుందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి (Janga Raghava Reddy) మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులకు పరిచయం చేయడానికి మెగా రైతు మేళా వేదికగా నిలిచిందని అన్నారు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడాలని రైతులకు సూచించారు. రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు వరి, పత్తి, మొక్కజొన్న పంటలపైనే ఆధారపడకుండా పప్పుధాన్యాలు, ఆయిల్ పామ్ వంటి వాణిజ్య పంటలను సాగు చేయాలని కోరారు. నాణ్యమైన విత్తనాలు, శాస్త్రవేత్తల సూచనల మేరకు సాగు చేయడం ద్వారా దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, ఆర్డీవో రాథోడ్ రమేష్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, ఉద్యాన అధికారి అనసూయ తదితర అధికారులు పాల్గొన్నారు.

Read Also: కేటీఆర్‌కు మతి భ్రమించింది.. ఎమ్మెల్యే నాయిని ఫైర్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>