కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ (Nalgonda) జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు అధ్వాన్నంగా మారాయి. జిల్లా యంత్రాంగం.. మంత్రులు కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది . రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో వెయిట్ చేస్తున్నా.. కాంటా వేసే దిక్కు లేకుండా పోయింది. వర్షాల కారణంగా ఇప్పటికే ధాన్యం తడిసింది.
తేమశాతం కోసం అష్టకష్టాలు
ధాన్యం బాగా ఆరబెట్టుకుని తేమ శాతం నిబంధనలకు అనుగుణంగా ఉండేందుకు కల్లాల్లో రైతాంగం అష్టకష్టాలు పడుతోంది. తీరా మ్యాచర్ వచ్చే టైమ్‌కు అకాల వర్షం పడడంతో ధాన్యం తడిసి ముద్దయ్యి.. మ్యాచర్ వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ పది పదిహేను రోజుల పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రజాప్రతినిధులు మాత్రం తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామంటూ చెప్పి వెళ్లిపోయారు. కానీ అధికారులు మాత్రం మ్యాచర్ వస్తేనే ధాన్యం కాంటాలు పెడతామంటూ మొండికేస్తున్నారు.
కేంద్రాల్లో అరిగోసే..
నల్లగొండ (Nalgonda) జిల్లాలో వరిధాన్యం సేకరించేందుకు ప్రభుత్వం 457 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. కానీ ఇందులో పూర్తిస్థాయిలో నేటికీ కొనుగోళ్లు ఊపందుకోలేదు. అయితే ఇప్పటివరకు ఈ కొనుగోలు కేంద్రాల్లో 37,451 మంది రైతుల నుంచి 3.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. కానీ ఈ ధాన్యానికి సంబంధించిన డబ్బులు రోజులు గడుస్తున్నా.. రైతు ఖాతాల్లో జమ కావడం లేదు. ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో పరిధిలో 37,451 మంది రైతుల నుంచి రూ.762 కోట్ల విలువైన ధాన్యం సేకరిస్తే.. కేవలం 17,786 మంది రైతులకు మాత్రమే రూ.333 కోట్లు ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 20 వేల మందికి పైగా అన్నదాతలకు డబ్బులు చెల్లించాల్సి ఉంది.
కాంటాకు 20 రోజులు
వాస్తవానికి రైతులు నేరుగా రైసు మిల్లుల వద్దకు వెళ్లి ధాన్యం విక్రయిస్తే.. క్షణాల వ్యవధిలో ధాన్యం కాంటా కావడం.. డబ్బులు సైతం గంటల వ్యవధిలోనే రైతు చేతికి అందుతున్నాయి. కానీ ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు విక్రయిస్తే.. ధాన్యం కాంటా వేసేందుకే 20 రోజులకు పైగా సమయం పడుతోంది. ఇక ధాన్యం డబ్బులు చేతికి అందేసరికి నెలలు గడిచే పరిస్థితి నెలకొంది. మిల్లుల్లో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని.. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే.. సకాలంలో కాంటాలు వేయకుండా తూకం, తాలు పేరుతో కొర్రీలు పెడుతూ.. వామ్మో ఇంకోసారి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావొద్దనే భావనను అన్నదాతల్లో కల్పిస్తుండడం గమనార్హం.
అధికార యంత్రాంగం ఫెయిల్
నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికార యంత్రాంగం ఘోరం విఫలమవుతోంది. నల్లగొండ జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో 5.56 లక్షల ఎకరాల్లో రైతాంగం వరిసాగు చేసింది. దాదాపు 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో దాదాపు 70 శాతం ధాన్యాన్ని జిల్లాలో ఏర్పాటు చేసిన 457 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వరికోతలు ప్రారంభమై.. దాదాపు రెండు నెలలు కావొస్తోంది. ఇప్పటివరకు కేవలం 3.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించింది. కొండంత లక్ష్యం కండ్ల ముందు కన్పిస్తున్నా.. అధికార యంత్రాంగంలో మాత్రం కనీసం చలనం లేదు.
ట్యాబ్ ఎంట్రీలో నత్తతో పోటీ
ట్యాబ్ ఎంట్రీ విషయంలోనైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పటివరకు 3.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే.. కేవలం 1.77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లెక్కలను మాత్రమే ట్యాబ్ ఎంట్రీ చేశారు. నిజానికి ధాన్యం ఎంత కొనుగోలు చేసినప్పటికీ ట్యాబ్ ఎంట్రీ చేయకపోతే అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో నగదు జమకాదు. ఇప్పటికైనా కలెక్టర్, జిల్లా యంత్రాంగం దృష్టిసారించి అన్నదాతలను అరిగోస నుంచి తప్పించాల్సిన అవసరం ఉంది.
Read Also: ఆర్చరీ వరల్డ్ కప్: చేజారిన పతకాలు!
Follow Us On: WhatsApp

