కలం, నిజామాబాద్ బ్యూరో: బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుస్సాపూర్ గ్రామంలో ‘మన ఊరు, మన భద్రత, మన బాధ్యత‘ కార్యక్రమంలో భాగంగా 18 సీసీ కెమెరాలను బిగించారు. ఈ కెమెరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Nizamabad CP) ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడము ఎంతో సంతోషమని, ఒక్క సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమని చెప్పుకొచ్చారు.
సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో జరిగే నేరాలు అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని, నేరాల నివారణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఈ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని వివరించారు.
ప్రజలు తమ ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని , పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ సూచించారు. పోలీస్ శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలకు ప్రజలు ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు వారి భద్రత కోసం సీసీ కెమెరాలను పెట్టాలని చెప్పారు. ఇది వారి బాధ్యతగా తీసుకోవాలి. నగల దుకాణాల యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని సూచించారు.
బస్సాపూర్ గ్రామంలో 18 కెమెరాలు పెట్టి సహకరించిన గ్రామ పంచాయతీని సీపీ అభినందించారు. ఈ సందర్భంగా బస్సాపూర్ గ్రామంలో డ్రగ్స్ నివారణ, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన, రోడ్డు ప్రమాదాలను నివారణ కోసం అన్నీ రకాల జాగ్రత్త లు తీసుకోవాలని అన్నారు. పంటపొలాలలో ఎవరు కూడా మంటలు పెట్టరాదని , అందుకోసం మల్టీ పోటాషియం మందులు వాడినట్టుయితే భూ సంద్రత బాగుంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎ. సి. పి జె. వెంకటేశ్వర్ రెడ్డి , ఆర్మూర్ రూరల్ సి.ఐ జాన్ రెడ్డి, బాల్కొండ ఎస్.ఐ శైలందర్, బస్సాపూర్ సర్పంచ్ శ్రీనివాస్ శ్రీరాంపూర్ సర్పంచ్ ఎర్రన్న, గ్రామ అభివృద్ధి సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.

