కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో డయల్ 100 / 112 వ్యవస్థ పనితీరును మెరుగుపరిచేందుకు, ఎదురయ్యే లోపాలను అధిగమించడానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ. సాయి చైతన్య(CP Sai Chaitanya) ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్ నుండి వచ్చిన సాంకేతిక నిపుణులు, ఎస్.ఐలు, సీఐలు, డయల్ 100 / 112 సిబ్బందికి సమగ్ర మార్గదర్శక సూచనలు, శిక్షణ ఇచ్చారు.
ఈ శిక్షణలో కాల్స్ రావడం నుంచి సంఘటన స్థలానికి చేరుకోవడం వరకు సమయపాలన ముఖ్యతను గుర్తుచేసి, బాధితులకు తక్షణ సహాయం అందించడం ముఖ్యమని పేర్కొన్నారు. అలాగే, కాల్స్ స్వీకరించడం, సమాచారాన్ని క్షేత్రస్థాయి సిబ్బందికి చేరవేయడంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను ఎలా పరిష్కరించాలో నిపుణులు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులతో సిబ్బంది ఓపిక, మర్యాద, సంపూర్ణ వివరణ సేకరణతో వ్యవహరించాలని కమిషనర్ (CP Sai Chaitanya) స్పష్టం చేశారు. కంట్రోల్ రూమ్ సిబ్బందికి గస్తీ వాహనాల మధ్య సమన్వయాన్ని పెంచి నేరాలను మరింత నియంత్రించవచ్చని సూచనలు ఇవ్వబడ్డాయి. డయల్ 100 / 112 కాల్స్ స్థితిగతులను ఉన్నతాధికారులు ఎల్లప్పుడూ పర్యవేక్షించేలా కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలకు సమర్థవంతమైన, నాణ్యమైన, తక్షణ సేవలను అందించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి బి. బస్వా రెడ్డి, హైదరాబాద్ నుండి వచ్చిన చీప్ టెక్నికల్ ఆఫీసర్ రాజీవ్ కృష్ణ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హరీష్ కృష్ణ, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సి.టి.సి. ఎస్పీలు ప్రకాష్, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్, రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సీసీఆర్‌బి ఇన్స్పెక్టర్ అంజయ్య, సీఐలు, ఎస్సైలు, పోలీస్ స్టేషన్ రైటర్స్, డయల్ 100 / 112 సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: 30 మంది మావోయిస్టు అగ్రనేతలు ఎన్ కౌంటర్..
Follow Us On : WhatsApp

