కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు చిల్లర మాటలా? అంటూ రేవంత్ర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తాను మాట్లాడేందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తోందన్నారు. సంగారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ (Revanth Reddy).. జిల్లాకు రూపాయి నిధులైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు.
జిల్లాకు ఏం చేశారు?
సంగారెడ్డి ప్రజలు తాగునీటి ఇబ్బందులు పడుతున్నారని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏమి చెప్పుకునేందుకు లేకనే ఇలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందుకు 420 హామీలు ఇచ్చారని.. ఇప్పుడు 420 మాటలు మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లాలో ప్రాజెక్టుల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడలేదని విమర్శించారు. జిల్లాలోని సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు పనుల ఊసే ఎత్తలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఒక్క కిలోమీటర్ రోడైనా వేశారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంగారెడ్డి జిల్లాకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

