Mobile Popup Ad
Mobile Popup Ad

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: కలెక్టర్

కలం, నిర్మల్ : నేటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, ఉన్నత లక్ష్యాల దిశగా పయనించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా (Nirmal Collector Bhavesh Mishra) పిలుపునిచ్చారు. ‘మిషన్ పరివర్తన’ లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని దీక్ష జూనియర్ కళాశాలలో గురువారం నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్ – వికసిత్ భారత్ కి పెహచాన్’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత యాంత్రిక జీవనశైలి, ఒత్తిడి కారణంగా యువత మత్తు పదార్థాల బారిన పడుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు.

మత్తు పదార్థాలకు బానిస కావడం అంటే జీవితాన్ని నాశనం చేసుకోవడమేనని, దీని నుంచి బయటపడటానికి యువత దృఢ సంకల్పంతో ఉండాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు బానిస కాకుండా, విలువైన సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయించాలని, గొప్ప శాస్త్రవేత్తలు, సంఘసంస్కర్తల జీవిత చరిత్రలను స్ఫూర్తిగా తీసుకోవాలని హితవు పలికారు. పేదరికం, చదువుల ఒత్తిడి, ఇతరులతో అనవసరమైన పోలికల వల్లే మానసిక ఆందోళనకు గురై యువత తప్పుడు మార్గాల్లో పయనిస్తున్నారని కలెక్టర్ విశ్లేషించారు.

వ్యతిరేక ఆలోచనలు రాకుండా, అభ్యాసంలో నిమగ్నమై ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, వారి సందేహాలకు సమాధానాలిచ్చారు. అనంతరం అందరితో కలిసి నషా ముక్త్ భారత్ (మత్తు రహిత భారత్) కోసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వినూత్న, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి పరశురాం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>