కలం, మెదక్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమం ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని ఇనుమడింపజేస్తుందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి (MLC Anji Reddy) పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతిఒక్కరూ తమ ఇంటి మీద మువ్వన్నెల పతాకం ఎగరవేయలన్నారు.
నా ఇల్లు – నా జెండా – నా దేశం నినాదంతో సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్సీ సగర్వంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని, మన జాతి ఆత్మగౌరవం ప్రపంచానికి తెలియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి పాల్గొన్నారు.

