కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలానికి చెందిన జడ్పీహెచ్ఎస్ ఒద్యారం SHVR-2025-26 జాతీయ స్థాయి రేటింగ్లో దేశంలో 23వ ర్యాంకు, తెలంగాణలో 5వ ర్యాంకు సాధించించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (Medipally Satyam) తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం గంగాధర మండలానికే కాకుండా మొత్తం చొప్పదండి నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు దేశ భవిష్యత్తుకు పట్టుకొమ్మల వంటివని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులే రేపటి సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. 2017-18లో పాఠశాల రాష్ట్ర స్థాయి అవార్డు సాధించినప్పుడు తాను ఎంతో సంతోషించానని, ఇప్పుడు అదే పాఠశాల జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం మరింత ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఒక చిన్న గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం అభినందనీయమని కొనియాడారు.
జడ్పీహెచ్ఎస్ ఓద్యారం ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు సమష్టిగా కృషి చేయడం వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ, నాణ్యమైన విద్య అందించడంలో పాఠశాల చూపుతున్న కృషి ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల బృందానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేసి, భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రతినిధులు పాల్గొన్నారు.

