కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని పెదకంజర్ల గ్రామంలో గుడిసెల తొలగింపు కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హెచ్ఎండీఏ సంస్థకు కేటాయించిన ప్రభుత్వ భూముల్లో స్థానికులు నిర్మించుకున్న 45 గుడిసెలను రెవెన్యూ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు.
గతంలో పటాన్ చెరువు మండలం పెద్ద కంజర్ల గ్రామంలోని 120, 121, 125 సర్వే నెంబర్లు పరిధిలో గల 214 ఎకరాల అసైన్డ్ భూమిని రెవెన్యూ అధికారులు హెచ్ఎండీఏకి కేటాయించారు. అయితే, ఇందులో సర్వే నెంబర్ 125 లో ఉన్న ఐదెకరాల స్థలంలో గత కొంతకాలంగా సుమారు 45 పేద కుటుంబాలు గుడిసెలు వేసుకుని నివాసముంటున్నాయి.ఈ ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు రావడంతో స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు నివాసం లేకుండా చేస్తున్నారంటూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ కాసేపు హై టెన్షన్ నెలకొంది. పోలీసులకు, గుడిసెలు వేసుకున్న స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి, వారి బందోబస్తు నడుమ అధికారులు గుడిసెలను పూర్తిగా కూల్చివేసి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు.

