కలం, నిర్మల్ : వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రజలంతా బాధ్యతగా మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Nirmal Collector Bhavesh Mishra) అన్నారు. మామడ మండలం లింగాపూర్ తండాలో గురువారం వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలువురు అధికారులు, విద్యార్థులతో కలిసి సామూహికంగా మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రజలంతా విరివిగా మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యతను కాపాడే ఈ మహా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని కలెక్టర్ కోరారు. అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్రంగూడా ఈకో పార్కును ప్రారంభం చేసి వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన కార్యక్రమాన్ని, మామడ మండల కేంద్రంలోని రైతు వేదికలో కలెక్టర్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, డిఆర్డిఓ విజయలక్ష్మి, తహసిల్దార్ శ్రీనివాస్, రైతులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

