కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లాలోని బాసరలో జరగనున్న గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు ప్రారంభించింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు సమకూర్చాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పుష్కరాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే సమగ్ర ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రత్యేకంగా పాత పుష్కర ఘాట్లకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, అవసరమైన చోట కొత్త ఘాట్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. భక్తులకు కనువిందుగా ఉండేలా ఘాట్లను సుందరీకరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
అదేవిధంగా కళ్యాణ కట్టలు, పిండ ప్రదాన వేదికలు, దుస్తులు మార్చుకునే గదులు వంటి మౌలిక వసతులను త్వరితగతిన నిర్మించాలని ఆదేశించారు. భక్తులకు త్రాగునీటి కొరత లేకుండా సమృద్ధిగా నీటి సదుపాయం కల్పించాలని తెలిపారు. చేపట్టే ప్రతి నిర్మాణ పనిలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇక ఆయా శాఖల అధికారులు తమకు కేటాయించిన పనులకు సంబంధించిన పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా బాసర ఆలయ మాస్టర్ ప్లాన్‌పై కూడా చర్చించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, బాసర ఆలయ ఈవో అంజనా దేవి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

