కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాల పరిస్థితులపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను స్పష్టంగా ఆదేశించారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని రామ్‌నగర్ బాలికల ఆశ్రమ వసతిగృహాన్ని(Ramnagar Girls Hostel) సందర్శించిన కలెక్టర్, అక్కడి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. వసతి గృహంలో మొత్తం విద్యార్థుల సంఖ్య, హాజరు, వారికి అందిస్తున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.
విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, వారి చదువుపై ఆసక్తిని పరీక్షించారు. పలు సబ్జెక్టులలో ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని అంచనా వేశారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలని, ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే ఉపాధ్యాయులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ తనిఖీలలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న, మండల విద్యాశాఖ అధికారి సిద్ధపద్మ తదితరులు పాల్గొన్నారు.

