కలం, నిర్మల్ : దేశాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని బీజేపీ నేత రావుల రాంనాథ్ ఆరోపించారు. గురువారం నిర్మల్ ( Nirmal ) జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీలో నిర్వహించిన కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నీట్ పరీక్ష అంశాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. నీట్ పరీక్ష పేరుతో కమ్యూనిస్టులు, దేశ వ్యతిరేక శక్తులు దేశాన్ని విభజించే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఆర్టికల్ 370ను మళ్లీ అమలు చేయాలని, ఆర్ఎస్ఎస్‌ను నిషేధించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని పేర్కొంటూ సనాతన ధర్మానికి, ఆర్ఎస్ఎస్‌కు, నీట్ పరీక్షలకు సంబంధం ఏమిటి అని రావుల రాంనాథ్ ప్రశ్నించారు. ఇది నవ భారతం.. ప్రధాని నరేంద్ర మోదీ భారతం అని, ఇలాంటి విచ్ఛిన్నకర శక్తుల కుట్రలకు బీజేపీ ఏమాత్రం భయపడదని అన్నారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీక్, కౌన్సిలర్లు గంజి రాజు, విఠల్, సూరజ్, నాయకులు సాదం అరవింద్, ధర్మాజీగారి ఈశ్వర్, పొడెల్లి గణేష్, జాప ప్రసాద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

