పులివీరన్న ఆశయాలే మనకు మార్గదర్శకం: యెన్నం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మాజీ మంత్రి పులివీరన్న ఆశయాలే తమకు మార్గదర్శకమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) పేర్కొన్నారు. తొలి తెలంగాణ ఉద్యమకారులు మహబూబ్ నగరానికి చెందిన ప్రముఖ ప్రజానాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా సేవలందించిన పులివీరన్న 80వ జయంతి సందర్భంగా గ్రీన్ బెల్ట్, పద్మావతి కాలనీలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా యెన్నం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పులివీరన్న కీలక పాత్ర పోషించిన మహానాయకుడని కొనియాడారు. 1969 తెలంగాణ ఉద్యమంలో యువకుడిగా ఆయన చేసిన పోరాటం, ధైర్యసాహసాలు నేటికీ ప్రేరణగా నిలుస్తున్నాయని తెలిపారు. ప్రజలు ప్రేమతో ఆయనకు “పులి” అనే బిరుదు ఇచ్చి “పులివీరన్న”గా పిలిచారని గుర్తు చేశారు.

పులివీరన్న ప్రజల పట్ల అపారమైన ప్రేమతో, నిస్వార్థ సేవతో పనిచేసిన నాయకుడని పేర్కొన్నారు. మహబూబ్ నగర అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. రాజకీయాల్లో సోదరభావం, పరస్పర గౌరవం ఉండాలని ఆయన చూపిన మార్గం నేటి తరం నాయకులు అనుసరించాల్సిన అవసరం ఉందని సూచించారు. పులివీరన్న సహచర్యంలో పనిచేసిన వారు ఆయనతో గడిపిన అనుభవాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ, ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు.

పులివీరన్న ఆశయాలు కొనసాగిద్దాం..

ఆయన మరణించిన తరువాత కూడా ప్రజల మదిలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉండటం ఆయన గొప్పతనానికి నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. పులివీరన్న ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆయన చూపిన మార్గంలోనే నడవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రాజకీయాలు అనేది కేవలం ఎన్నికల వరకే పరిమితం చేసిన నాయకులు పులి వీరన్న, చంద్రశేఖర్ లు అని, వారు ఇరువురు రాజకీయాలకు గొప్ప నిర్వచనం చెప్పారని ఆయన గుర్తు చేశారు. మహబూబ్ నగర చరిత్రలో పులివీరన్న శాశ్వతంగా నిలిచిపోయే నాయకుడిగా గుర్తుండిపోతారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు వేముల కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు అమరేందర్ రాజు, మైత్రి యాదయ్య కార్పొరేటర్లు, పులి వీరన్న, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>