కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం తెలంగాణ ప్రభుత్వం వినూత్న రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ‘పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్’ (PRT) పేరుతో పిలిచే ‘పాడ్ ట్యాక్సీ’ (Pod Taxi) సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం నగరంలో ప్రతిరోజూ దాదాపు 5 లక్షల మంది మెట్రోను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆటోలు, బస్సుల కొరత, అధిక ఛార్జీలు, ట్రాఫిక్ కష్టాల వల్ల ఐటీ కారిడార్లు, ప్రధాన కార్యాలయాలకు చేరుకోవడం ఇబ్బందిగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా రోడ్డు ట్రాఫిక్‌తో సంబంధం లేకుండా ఎలివేటెడ్ ట్రాక్‌లపై నడిచే పాడ్ టాక్సీలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మొదటి విడతలో రాయదుర్గం-కూకట్‌పల్లి, రాయదుర్గం-హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ సిటీ, సచివాలయం పరిసర ప్రాంతాలలో ఈ సేవలను అమలు చేయనున్నారు. డ్రైవర్‌లెస్‌గా పనిచేసే ఈ ఎలక్ట్రిక్ పాడ్ పాడ్ ట్యాక్సీలు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక్కో పాడ్‌లో 6 నుంచి 8 మంది ప్రయాణించే వీలుండగా, గంటకు సుమారు 10,000 మందిని ఇవి చేరవేస్తాయి. బ్యాటరీ, విద్యుత్‌తో నడవడం వల్ల ఇవి పర్యావరణహితంగాను మేలు చేస్తుంది.
ఇప్పటికే ముంబైలో ఇలాంటి ప్రాజెక్ట్ పనులు సాగుతుండగా, హైదరాబాద్‌లోనూ త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనుంది. ఈ ప్రాజెక్టును వేగవంతం చేసే దిశగా ఇటీవల హైదరాబాద్ అధికారులు ప్రత్యేకంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ అధ్యయనం ద్వారా ఏయే మార్గాల్లో ట్రాక్‌లు నిర్మించాలి? సాంకేతిక ప్రమాణాలు ఎలా ఉండాలి? ప్రయాణికులకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుందనే విషయాలపై స్పష్టత సాధించేందుకు చర్యలు చేపట్టారు. స్పష్టమైన నివేదిక పూర్తయితే.. హైదరాబాద్‌వాసులకు ఈ పాడ్ ట్యాక్సీలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

