epaper
Tuesday, November 18, 2025
epaper

దేశవ్యాప్తంగా పేలుళ్లకు ఉగ్రకుట్ర

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన వెనక పెద్ద ఎత్తున ఉగ్రకుట్ర దాగి ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. 26/11 ముంబయి దాడుల తరహాలో ఢిల్లీతో పాటు దేశంలోని పలు నగరాల్లో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు ప్రణాళిక రచించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ కుట్రలో పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్‌ ఉగ్ర ముఠా ప్రమేయం ఉన్నట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో(NIA Probes) తేలుతోంది. ఈ టెర్రర్‌ మాడ్యూల్‌ టార్గెట్‌లలో ఎర్రకోట, ఇండియా గేట్‌, కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌, గౌరీశంకర్‌ ఆలయంతో పాటు దేశంలోని పలు రైల్వే స్టేషన్లు, షాపింగ్‌ మాల్స్‌ కూడా ఉన్నాయి. జనవరి నుంచే ఈ మాడ్యూల్‌ దాడుల ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు విచారణలో బయటపడింది.

200 ఐఈడీలు సిద్ధం చేసే ప్రణాళిక

దర్యాప్తు సంస్థల సమాచారం మేరకు, ఈ మాడ్యూల్‌ సుమారు 200 ఐఈడీలు తయారు చేసి, దేశవ్యాప్తంగా పేలుళ్లు సృష్టించాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగింది. ఈ కుట్రలో “వైద్యుల టెర్రర్‌ మాడ్యూల్‌” పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. వైద్య విద్యలో ఉన్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి పేలుడు పదార్థాల మిశ్రమాలు సిద్ధం చేసినట్లు అనుమానిస్తున్నారు.

2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

ఇటీవల జమ్మూకశ్మీర్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో సంయుక్త దాడులు నిర్వహించిన కేంద్ర ఏజెన్సీలు అమ్మోనియం నైట్రేట్‌, పొటాషియం నైట్రేట్‌, సల్ఫర్‌ మిశ్రమంతో కూడిన 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. ఇవి భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించగలవని అధికారులు పేర్కొన్నారు.

ఫోరెన్సిక్‌ పరిశీలనలో కీలక ఆధారాలు

ఎర్రకోట పేలుడు జరిగిన ప్రదేశం నుంచి 40 నమూనాలను ఫోరెన్సిక్‌ నిపుణులు సేకరించారు. వాటిలో అమ్మోనియం నైట్రేట్‌ ఆనవాళ్లు ఉన్నట్లు నిర్ధారణ అయింది. అదనంగా, మరో అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థం కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఇది మిలిటరీ గ్రేడ్‌ ఎక్స్‌ప్లోసివ్‌ అయి ఉండొచ్చని భావిస్తున్నారు.

కొనసాగుతున్న ఎన్ఐఏ దర్యాప్తు(NIA Probes)

ఢిల్లీ పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది. దర్యాప్తు కోసం పది మంది ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందం ఏర్పాటుచేసింది. జమ్మూకశ్మీర్‌, హరియాణా, ఢిల్లీ పోలీసుల నుంచి కేసు డైరీలు, సీసీటీవీ ఫుటేజీలు, ఫోన్‌ రికార్డులు సేకరించింది. నిందితుల ఆర్థిక లావాదేవీలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా పరిస్థితులను సమీక్షించేందుకు ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌, ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌ బుధవారం సాయంత్రం కీలక భేటీ నిర్వహించనున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని కేంద్ర హోం శాఖ సూచించినట్లు సమాచారం.

Read Also: తోట తరణికి అత్యున్నత గౌరవం

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>