ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనతో హరియాణాలోని ఫరీదాబాద్ అల్ ఫలాహ్ యూనివర్సిటీ(Al Falah University) పేరు చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కుట్రలో భాగస్వాములైన డాక్టర్ల ఈ యూనివర్సిటీ వారు కావడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో అక్కడ పనిచేసే సిబ్బంది, వైద్యుల మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ అనుమానాలపై వర్సిటీ స్పందించింది. వైస్ చాన్సలర్ భూపిందర్ కౌర్ ఆనంద్ పేరిట ఓ లేఖ విడులైంది. ఈ పరిణామాలపై యూనివర్సిటీ యాజమాన్యం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఈ దురదృష్టకర ఘటనలతో బాధితుల పట్ల మాకు సానుభూతి ఉంది. కానీ మా సంస్థపై వస్తున్న నిరాధార కథనాలను మేం ఖండిస్తున్నాం. ఆ వైద్యులు వృత్తిపరంగా మాత్రమే మా వద్ద పనిచేస్తున్నారు. విశ్వవిద్యాలయానికి వారితో ఎటువంటి ఇతర సంబంధం లేదు.’ అని స్పష్టం చేసింది.
అల్-ఫలాహ్ గ్రూప్ 1997 నుంచి విద్యాసంస్థలను నిర్వహిస్తోందని, యూజీసీ గుర్తింపు పొందిన అనంతరం 2019లో ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించామని తెలిపింది. ‘మా పూర్వ విద్యార్థులు దేశ, విదేశాల్లో ప్రతిష్టాత్మక సంస్థల్లో సేవలందిస్తున్నారు. యూనివర్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై మేం ఆందోళన చెందుతున్నాం. మా ల్యాబ్‌ల్లో ఏవైనా రసాయనాలను నిల్వ చేయడం లేదా వాటిని అనుమానాస్పదంగా ఉపయోగించడం జరగలేదు. మీడియా సంస్థలు సమాచారం ధ్రువీకరించుకొని ప్రచురించాలి,’ అని పేర్కొంది.
అరెస్టయిన వారిలో అల్ ఫలాహ్ యూనివర్సిటీ(Al Falah University)కి చెందిన ఇద్దరు వైద్యులు ఉండటంతో ఆ విద్యాసంస్థ వార్తల్లో నిలిచింది. ఢిల్లీ పేలుడు అనుమానితుడు ఉమర్ కూడా గతంలో అక్కడ పనిచేసినట్టు సమాచారం. దీంతో భద్రతా సంస్థలు యూనివర్సిటీ క్యాంపస్‌లో తనిఖీలు నిర్వహించడంతో పాటు పలువురిని ప్రశ్నిస్తున్నాయి.
Read Also: దేశవ్యాప్తంగా పేలుళ్లకు ఉగ్రకుట్ర
Follow Us on : Pinterest

