Mobile Popup Ad
Mobile Popup Ad

కోదాడ లాకప్ డెత్ కేసు.. పోలీసులపై NHRC సీరియస్

కలం, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ (Kodad) పట్టణంలో దళిత యువకుడు కర్ల రాజేశ్ అనుమానాస్పద లాకప్ డెత్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. తెలంగాణ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని దాఖలు చేసిన ఫిర్యాదును స్వీకరించిన కమిషన్, ఈ దారుణంపై ప్రత్యేక విచారణను ప్రారంభించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో మూడు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలంటూ సూర్యాపేట జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. బాధిత యువకుడి మృతికి గల కారణాలను, వాస్తవాలను వెలికితీసేందుకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ కఠినంగా వ్యవహరిస్తోంది. నివేదికతోపాటు మృతదేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టం ప్రక్రియకు సంబంధించిన పూర్తి వీడియో రికార్డింగ్, మేజిస్ట్రియల్ విచారణ నివేదిక, పోలీస్ స్టేషన్ డైరీ, లాగ్‌బుక్ సహా ఈ కేసుతో సంబంధం ఉన్న రికార్డులు సమర్పించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.

థర్డ్ డిగ్రీతోనే మృతి

మృతుడు కర్ల రాజేశ్‌ను పోలీసులు ఐదు రోజులపాటు అక్రమంగా నిర్బంధించారని, ఆ సమయంలో పోలీస్ స్టేషన్‌లో థర్డ్ డిగ్రీ చిత్రహింసలకు గురిచేయడం వల్లే రాజేశ్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొడుకు అక్రమ నిర్బంధంపై తల్లి పోలీసులకు ముందే ఫిర్యాదు చేసినప్పటికీ, స్థానిక పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణానికి కారణమైన బాధ్యులైన పోలీసులపై తక్షణమే హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను కోరారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ రంగంలోకి దిగడంతో ఈ కేసులో నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని స్థానికులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>