కలం, నిజామాబాద్ బ్యూరో : హైవే అథారిటీ అఫ్ ఇండియా (NHAI) ఆధునిక టెక్నాలజీని తీసుకొచ్చింది. హెల్మెట్ లేకుండా బైక్ పై వెళ్లినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా.. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారులో ప్రయాణించినా, సిగ్నల్ ఇవ్వకుండా.. ముందుకు వెళ్ళినా నేరుగా ఇంటికే చలాన్లు పంపుతుంది. మహారాష్ట్రలోని ముంబయి-పుణె ఎక్స్ ప్రెస్ హైవే గతంలో భారీగా ప్రమాదాల నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణతో ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. అదే తరహాలో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న ఎన్ హెచ్ 44 లోని హైదరాబాద్ – ఆదిలాబాద్ సెక్షన్ ను పైలట్ ప్రాజెక్టుకు ఉన్నతాధికారులు ఎంపిక చేశారు. డిజిటల్ నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేసే దిశగా ఎన్ హెచ్ఐఏ (NHAI) అధికారులు చర్యలు చేపట్టారు. దేశంలోనే అత్యంత కీలకమైన జాతీయ రహదారుల్లో 44వ నంబర్ హైవే ఒకటి. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ సెక్షన్ లో ప్రతి రెండు కి.మీ.కు ఒక ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ – ఏఎన్పీఆర్ కెమెరాను బిగించారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన ఈ నెలలో ఉన్నందునా ప్రారంభించబోయే ప్రాజెక్టుల్లో దీన్ని కూడా చేర్చాలని ప్రతిపాదించారు. కామారెడ్డి జిల్లా ఇల్చిపూర్, మెదక్ జిల్లా చేగుంట వద్ద బిగించిన రెండు ఫొటో, రెండు వీడియో కెమెరాలు ఇప్పటికే పని చేస్తున్నాయి.
వాహన వేగంతో పాటు హెల్మెట్ లేకపోవడం. సీట్ బెల్ట్ ధరించకపోవడం, మొబైల్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలన్నింటినీ ఇవి ఆటోమేటిక్ గా గుర్తించి నమోదు చేస్తున్నాయి. ఇల్చిపూర్, చేగుంటలో బిగించిన రెండు ఫొటో వీడియో కెమెరాలు నిబంధనల ఉల్లంఘనలపై సగటున నెలకు 10 వేల చలాన్లు నమోదు చేశాయి. ఈ రెండుచోట్ల ఉన్న రెండు వీడియో కెమెరాల ద్వారా సగటున 15 వేల చలాన్లు జారీ అవడం వాటి పనితీరుకు అద్దం పడుతున్నాయి. మితిమీరిన వేగంతో వెళ్లే వాహనదారులను ఈ సాంకేతికత పసిగడుతుంది. వాహనం ఒక కెమెరా పాయింట్ నుంచి మరొకడానికి చేరుకునే సమయాన్ని ఈ కెమెరాలు ఏఐ సాంకేతికతతో లెక్కించి.. సగటు వేగాన్ని నిర్ధారిస్తాయి. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కెమెరాల పనితీరును పరిశీలించారు. ఏఐ ఆధారిత మానవ ప్రమేయం లేకుండా ఉన్న నిఘా వ్యవస్థను జాతీయ రహదారిపై ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.

