కలం, నల్లగొండ బ్యూరో: సూర్యాపేట మట్టిలో పుట్టిన ఒక సామాన్య టీచర్.. నేడు అగ్రరాజ్యం అమెరికా మెచ్చిన గురువుగా గ్లోబల్ వేదికపై మెరుస్తున్నారు. పేదరికాన్ని జయించి.. విదేశీ గడ్డపై వేలాది మంది విద్యార్థుల మనసు గెలుచుకున్న నెరేడుచర్ల వాసి షేక్ నాగుల్‌మీరా (Nagul Meera).. ప్రతిష్ఠాత్మక ‘అమెరికాస్ ఫేవరెట్ టీచర్ 2026’ పోటీలో ఫైనలిస్ట్‌గా నిలిచి చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది పోటీపడిన ఈ రేసులో, తన బోధనా నైపుణ్యంతో ఫైనల్ రౌండ్‌కు చేరుకున్న ఆయన, ప్రస్తుతం టాప్-3లో కొనసాగుతున్నారు. గెలిస్తే రూ. 20 లక్షల నగదు బహుమతితోపాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుంది. పదిహేనేళ్ల బోధనా అనుభవంతో జార్జియాలో మ్యాథ్స్ టీచర్‌గా అలరిస్తున్న నాగుల్ మీరా.. ప్రస్తుతం గెలుపునకు అడుగు దూరంలో నిలిచారు.
నాగుల్‌మీరాది నెరేడుచర్ల..
తెలంగాణ మట్టిలో పుట్టిన ఒక సామాన్య ఉపాధ్యాయుడు నేడు అగ్రరాజ్యం అమెరికాలో ప్రతిష్ఠాత్మక గుర్తింపు దిశగా దూసుకుపోతున్నారు. సూర్యాపేట జిల్లా నెరేడుచర్లకు చెందిన షేక్ నాగుల్‌మీరా(Nagul Meera).. అమెరికాలో నిర్వహిస్తున్న ‘అమెరికాస్ ఫేవరెట్ టీచర్-2026’ పోటీలో ఫైనల్ దశకు చేరుకుని చరిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో పబ్లిక్ స్కూల్ గణితశాస్త్ర ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్నారు. అయితే నాగుల్‌మీరా ప్రయాణం భవిష్యత్ తరాలకు అత్యంత స్ఫూర్తిదాయకం. ఒక పేద కుటుంబంలో జన్మించిన ఆయన, చదువుపై ఉన్న మక్కువతో పార్ట్-టైమ్ పనులు చేస్తూనే ఎంఎస్సీ (అప్లైడ్ మ్యాథమెటిక్స్), బీఎడ్ పూర్తి చేశారు. చదువు తన జీవితాన్ని మార్చేసిందని. అదే తనను ఈ స్థాయికి చేర్చింది అంటూ నాగుల్‌మీరా గర్వంగా చెబుతారు. తన 15 ఏండ్ల బోధనా వృత్తిలో భాగంగా భారత్‌తోపాటు యూఏఈ, ఆఫ్రికా దేశాల్లో పనిచేశారు. కోదాడలోని తేజ విద్యాలయంలోనూ నాగుల్‌మీరా గణిత ఉపాధ్యాయుడిగా సేవలందించారు.
ప్రతిష్ఠాత్మక పోటీ ఏమిటి?
ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘కొలోసల్’ ఈ పోటీని నిర్వహిస్తోంది. కేవలం బోధన మాత్రమే కాకుండా విద్యార్థుల జీవితాల్లో సానుకూల మార్పు తెచ్చే ఉపాధ్యాయులను గుర్తించడం ఈ పోటీ ఉద్దేశం. అనేక రౌండ్ల వడపోత తర్వాత నాగుల్‌మీరా ఫైనలిస్ట్‌గా నిలిచారు. ఈ పోటీలో విజేతగా నిలిస్తే దాదాపు రూ.20 లక్షలకుపైగా నగదు బహుమతి లభిస్తుంది. ప్రపంచ ప్రసిద్ధ ‘రీడర్స్ డైజెస్ట్’ మ్యాగజైన్‌లో ఆయన కథనం ప్రచురితమవుతుంది. అలాగే హవాయి పర్యటనతోపాటు ప్రముఖ అమెరికన్ టీవీ ప్రెజెంటర్ బిల్ నైతో కలిసి స్కూల్ అసెంబ్లీని నిర్వహించే అరుదైన అవకాశం లభిస్తుంది. ఇదిలావుంటే.. ప్రస్తుతం నాగుల్‌మీరా ఈ పోటీలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. పోటీ ముగియడానికి కేవలం మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ దశలో ఆయన గెలుపు పూర్తిగా ప్రజలు వేసే ఓట్లపై ఆధారపడి ఉంది. అమెరికాలోని విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు మద్దతు తెలిపితే ఆయన ప్రథమ స్థానానికి చేరుకోవడం ఖాయం.
గ్రామీణ విద్యార్థులకు రోల్ మోడల్..
విద్యార్థులు అడ్డంకులను అధిగమించి, తమలోని పూర్తి సామర్థ్యాన్ని గుర్తించేలా చేయడమే నా లక్ష్యం. పేదరికం నాలో నింపిన పట్టుదలే ఈ రోజు నన్ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిందని నాగుల్‌మీరా ఆశాభావం వ్యక్తం చేశారు. నిజానికి నాగుల్‌మీరా విజయం సాధించడం అంటే ఒక తెలంగాణ ఉపాధ్యాయుడి నైపుణ్యం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే. గణితం వంటి సబ్జెక్టును విదేశీ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించడం, వారి అభిమానాన్ని చూరగొని ఈ స్థాయికి రావడం ఆయన ప్రతిభకు నిదర్శనం. తెలంగాణ మట్టిలో పుట్టిన ఒక సామాన్య వ్యక్తి, అమెరికా వంటి అగ్రరాజ్యంలో ‘బెస్ట్ టీచర్’గా ఎదగడం భావి తరాలకు గొప్ప స్ఫూర్తి. ప్రధానంగా నాగుల్‌మీరా ప్రయాణం ఎందరో గ్రామీణ విద్యార్థులకు రోల్ మోడల్. మన తెలంగాణ బిడ్డ అంతర్జాతీయ వేదికపై అత్యుత్తమ ఉపాధ్యాయుడిగా నిలవాలని ఆకాంక్షిద్దాం. మీరు ఓటింగ్‌లో పాల్గొనాలనుకుంటే.. https://americasfavteacher.org/2026/nagulmeera-shaik లింకును సంప్రదించొచ్చు.

