కలం,మెదక్ బ్యూరో: సంగారెడ్డి శివారు కంది వద్ద ఉన్న ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad) క్యాంపస్‌లో సోమవారం నెక్ట్స్ జనరేషన్ పోస్టాఫీస్ (N-Gen) ప్రారంభమైంది. మారుతున్న సాంకేతికత, పెరుగుతున్న డిజిటల్ వినియోగ చెల్లింపులకు అనుగుణంగా తపాలా సేవలను ఆధునీకరించే లక్ష్యంతో తెలంగాణ తపాలా సర్కిల్ ఈ సబ్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటుచేసింది. దీనిని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డా.వీణా కుమారి, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి ప్రారంభించారు. ఈ పోస్ట్ ఆఫీసులో క్యూఆర్ ఆధారిత డిజిటల్ చెల్లింపులు, స్మార్ట్ సేవా కౌంటర్లు, ఉచిత వై-ఫై అందుబాటులో ఉంచారు.
టెక్నాలజీ అనుసంధానంతో, భారత తపాలా థీమ్‌తో కూడిన వినోదాత్మక గేమ్ కార్నర్లు ఏర్పాటు చేశారు. డిజిటల్ సేవలు వినియోగించే ఐఐటీ విద్యార్థులకు స్పీడ్ పోస్ట్‌పై 10 శాతం రాయితీ ఇస్తారు. ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad), తపాలా శాఖ, ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) కలిసి అభివృద్ధి చేసిన ఓపెన్-సోర్స్ జియోస్పేషియల్ డిజిటల్ అడ్రెస్సింగ్ వ్యవస్థ అయిన డిజిపిన్ (DIGIPIN) సేవలను ఈ సబ్ పోస్ట్ ఆఫీస్ కేంద్రంగా అందించనుంది. డిజిపిన్ దేశవ్యాప్తంగా కచ్చితమైన, ప్రామాణిక డిజిటల్ చిరునామాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
Read Also: నాగార్జున సాగర్ లో లిక్కర్ డాన్..!
Follow Us On: X(Twitter)


