నెట్టెంపాడుపై ఎందుకింత నిర్లక్ష్యం.. నలుగురు సీఎంలు మారినా..

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో:  గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో మొదలుపెట్టిన జవహర్ నెట్టెంపాడు (Nettempadu) ఎత్తిపోతల పథకం ఇంకా పూర్తవ్వడం లేదు. దశాబ్దాలు గడిచినా పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి వరద సమయంలో 21.425 టీఎంసీల నీటిని తరలించేందుకు ఈ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారు. ధరూర్ మండలంలోని నెట్టెంపాడు, ఉప్పేరు గ్రామాల సమీపంలో ఈ లిఫ్ట్ ను నిర్మించారు. జూరాల నుంచి కాలువల ద్వారా నీటిని ఈ నెట్టెంపాడు లిఫ్ట్ వరకు చేరుస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తారు. పంపింగ్ చేసిన నీరు కాలువల ద్వారా గూడెం దొడ్డి, ర్యాలంపాడు జాలాశయాలకు తరలిస్తారు. ఈ పనులన్నీ ఇప్పటికే పూర్తి అయ్యాయి.

పెండింగ్‌లో కాలువల పనులు

ఈ జలాశయాల నుంచి పంట పొలాలకు వెళ్లే కాలువల పనులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ కాలువల పనులు పూర్తయితే గద్వాల నియోజకవర్గంలోని గట్టు, ధరూర్, మల్దకల్ మండలాలకు, అలంపూర్ నియోజకవర్గంలోని ఐజ, ఇటిక్యాల మండలాలకు సాగునీరు అందుతుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ లిఫ్ట్ రూపొందించారు. లిఫ్ట్ పనులు, రెండు జలాశయాల నిర్మాణం పనులు పూర్తయినా కాలువల పనులు పెండింగ్‌లో ఉండడంతో నేటి వరకు 58 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. కాలువల పనుల కోసం భూసేకరణ చేపట్టాల్సి ఉంది. భూసేకరణ చేపట్టడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది.

నలుగురు ముఖ్యమంత్రులు మారినా..

ఈ లిఫ్ట్ ప్రారంభం నుంచి ఇంతవరకు నలుగురు ముఖ్యమంత్రులు మారినా ఈ కాలువల పనులు ముందుకు సాగకపోవడంతో లిఫ్ట్ నిర్మాణం పూర్తయినా ఉపయోగం లేకుండా పోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR) హయాంలో ఈ లిఫ్ట్ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం సీఎంగా కిరణ్‌కుమార్ రెడ్డి  (Kiran Kumar Reddy) బాధ్యతలు చేపట్టి నెట్టెంపాడు లిఫ్ట్ ప్రాంతం సందర్శించి కాలువల పనులు వెంటనే పూర్తి చేసి రెండు నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించినా ఆచరణలో అమలు కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ (KCR) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నెట్టెంపాడు (Nettempadu) లిఫ్ట్ గురించి పట్టించుకోలేదు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా‌లోని పెండింగ్ ప్రాజెక్టు లను పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయలేదు.

పెండింగ్ ప్రాజెక్టులు పట్టించుకోకుండా..

కేసీఆర్ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టకుండా కొత్తగా పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ పనులు చేపట్టి పదేళ్ల లో ఈ ప్రాజెక్టు పనులు కూడా సాగదీశారు. పదేళ్లు అధికారం లో ఉండి కూడా ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండానే అధికారం కోల్పోయారు. 2023 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జిల్లాకు చెందిన ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టారు. ఇక జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు పనులు పరుగులు తీస్తాయని జిల్లా ప్రజలు ఆశతో ఎదురు చూశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటినా ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే పడి ఉన్నాయి. ఇంకా మూడేండ్ల సమయంలోనైనా ప్రాజెక్టులు పూర్తవుతాయో లేదో అని జిల్లా రైతాంగం ఎదురుచూస్తోంది. ఒక్క నెట్టెంపాడు లిఫ్ట్ పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చినా రెండు నియోజకవర్గాలు సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య ఉన్న ఈ రెండు నియోజకవర్గాలు సాగునీటి కోసం ఉద్యమించే దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు.

గుడెం దొడ్డి రిజర్వాయర్:

నెట్టెంపాడు లిఫ్ట్ నుంచి మోటార్ల ద్వారా పంపింగ్ చేసిన నీరు గూడెం దొడ్డి జలశయానికి చేరుతుంది. దీనిని ధరూర్ మండలంలోని గుడెం దొడ్డి గ్రామం వద్ద నిర్మించారు. దీని నీటి నిల్వ సామర్థ్యం ఒక టి.ఎం.సి ఉంటుంది. ఈ రిజర్వాయర్ నీటి ద్వారా 62 వేల ఎకరాలకు సాగు నీటిని అందించాలన్నదే ప్రభుత్వం ముఖ్య ఉదేశ్యం.

ర్యాలంపాడు రిజర్వాయర్:

నెట్టెంపాడు (Nettempadu) లిఫ్ట్ కింద మరో జలాశయం నిర్మించారు. ఇది కూడా ధరూర్ మండలంలోని ర్యాలంపాడు గ్రామం వద్దే ఉంది.  దీని నీటి నిల్వ సామర్థ్యం 2.3 టీఎంసీలు. ఈ రిజర్వాయర్ నీటి ద్వారా 1.38 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రెండు రిజర్వాయర్ల మధ్య దూరం ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు జలాశయాలు నిర్మించి చాలాకాలం కావడంతో నిర్వహణ లేక పూర్తి స్థాయిలో నీరు నింపుతే లీకేజీల సమస్య అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ నెట్టెంపాడు ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి పెట్టి పూర్తి దృష్టి పెడితే నడిగడ్డ ప్రాంతం పచ్చని పైరులతో కళకళలాడే అవకాశం ఉంది.

Read Also: సీఎం కాన్వాయ్ సైజ్ తగ్గింపు.. ఇప్పుడు ఎన్ని వాహనాలంటే

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>