epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

వీధి కుక్కలకు ‘నో ఎంట్రీ’

కలం డెస్క్: వీధికుక్కల (Stray Dogs) సంచారం, వాటి ప్రవర్తన, కరవడంతో జనం గాయాలపాలు కావడం.. ఇలాంటి సంఘటనలను పరిగణనలోకి తీసుకున్న నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) అన్ని రాష్ట్రాల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులతో పాటు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, స్కూళ్ళు, కాలేజీలు, స్టేడియంలు, ఆఫీసులు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు.. ఇలాంటి జనం గుమికూడే అన్ని ప్రాంతాల్లో వీధికుక్కలకు ప్రవేశం ఉండకూదని స్పష్టం చేసింది. ఇందుకోసం సంబంధిత అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వీధి కుక్కలు నివసించే ప్రాంతాలు లేకుండా చేసుకోవాలని సూచించింది. ఇలాంటి ప్రతీ క్యాంపస్‌లో ఒక నోడల్ అధికారిని నియమించి వీధి కుక్కలు ఎంట్రీ కాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని నొక్కిచెప్పింది. ప్రతీ క్యాంపస్ బౌండరీకి తప్పనిసరిగా ఫెన్సింగ్ ఉండాలని, ఆ ఏర్పాట్లు చేయాలన్నది.

సుప్రీంకోర్టు తీర్పుతో మార్గదర్శకాల జారీ :

ఎక్కడెక్కడ వీధికుక్కల (Stray Dogs) బెడద ఉన్నదో రెండు వారాల వ్యవధిలో గుర్తించి అవి అక్కడ చేరకుండా, సంచరించకుండా ఎనిమిది వారాల వ్యవధిలో తగిన ఏర్పాట్లు చేయాలని ఎన్ఎంసీ కార్యదర్శి శ్రీవాస్తవ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, అన్ని విభాగాల కార్యదర్శులకు లేఖ రాశారు. వీధి కుక్కలు ఆవాసం ఉండే ప్రాంతాలను గుర్తించి ఇకపైన అవి సంచరించే అవకాశాలు లేకుండా చేయాలని, ఇందుకోసం పరిశుభ్రతపైనా దృష్టి పెట్టాలని సూచించారు. పైన పేర్కొన్న క్యాంపస్‌లలో నియమించిన నోడల్ అధికారి వివరాలను ప్రత్యేకంగా బోర్డు ద్వారా డిస్‌ప్లే చేయాలన్నారు. ఏదేని పరిస్థితుల్లో ఆ క్యాంపస్‌లలో వీధికుక్కలు కనిపిస్తే వాటిని పట్టుకుని మున్సిపల్ సిబ్బందికి అప్పగించి వాటికి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేయాలని, తిరిగి వాటినే అదే ప్రదేశాల్లో కాకుండా వేరేచోట వదిలేయాలని సూచించారు.

ప్రతీ ఆస్పత్రిలో యాంటీ రాబీస్ వ్యాక్సిన్ :

ప్రతీ ప్రభుత్వ ఆస్పత్రిలో యాంటీ రాబీస్ వ్యాక్సిన్ ఔషధాలను నిల్వ ఉంచుకోవాలని ఎన్ఎంసీ కార్యదర్శి నొక్కిచెప్పారు. కుక్క కాటుకు గురైన బాధితులకు వ్యాక్సిన్‌తో పాటు రాబిస్ ఇమ్యునోగ్లోబిన్ (ఆర్ఐజీ) కూడా ఇవ్వాల్సి ఉన్నందున దీన్ని కూడా తగినంతగా స్టాక్ ఉంచుకోవాలని సూచించారు. ఈ మందులు ఖరీదైనవి కావడంతో బైట దొరకడం కష్టమని, ప్రభుత్వం ద్వారా సమకూర్చుకుని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరానికి తగినట్లుగా నిల్వ ఉంచుకోవాలని సూచించారు. ఆస్పత్రుల ఆవరణలో వీధి కుక్కలు తిరగకుండా సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని సూచించారు. ఈ ఏర్పాట్లన్నీ చేసుకున్నట్లుగా ఎనిమిది వారాల్లో నివేదిక పంపాలని ఆదేశించారు.

Read Also: ప్రభాస్ స్పిరిట్ ఫస్ట్ లుక్ విధ్వంసం… ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించిన వంగా

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>