Mobile Popup Ad
Mobile Popup Ad

బాల్య వివాహ రహిత జిల్లాగా నారాయణపేటను మారుద్దాం: కలెక్టర్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నారాయణపేట(Narayanpet)ను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని కలెక్టర్ సీహెచ్.ప్రియాంక అన్నారు. జిల్లా అంటే అందమైన రోడ్లు, సుందరమైన భవనాలే కాదని.. అక్షరాస్యత, బాలల హక్కులు, మహిళా చట్టాల అమలు కూడా అని కలెక్టర్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో బాలలకు సంబంధించిన అంశాలపై నారాయణపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని బాలల సంరక్షణ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ డాక్టర్ వినీత్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆడపిల్లలు చదువుకోవాలని, పెళ్లి వయసు వచ్చాకే వివాహం చేసుకునేలా క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. బాల్య వివాహాలు ఎక్కువ జరిగే జిల్లాగా నారాయణపేటకు పేరుందని, దాని మనమే చెరిపేయాలన్నారు. ఒకప్పుడు వితంతుల పెళ్లిళ్లు ఆశ్చర్యంగా ఉండేవని, ఇప్పుడు సాధారణం అయ్యాయని తెలిపారు.

రాష్ట్ర స్థాయిలో అవార్డులు ఇప్పిస్తాం..

బాల్య వివాహం జరిగిన విషయం చెప్పకపోయినా, బాల్య వివాహాన్ని ప్రోత్సహించినా.. రెండేళ్ల జైలు శిక్ష ఉంటుందని కలెక్టర్ ప్రియాంక హెచ్చరించారు. చాలా గ్రామాల్లో బాల్య వివాహాల నిరోధక చట్టం గురించి తెలియదని, ఇకపై ప్రచారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా అంతటా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. బాల్య వివాహం జరిగినట్లు రుజువైతే క్షేత్ర స్థాయి అధికారి నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. జిల్లాలో ఈ సంవత్సరం ఒక్క బాల్య వివాహం జరగకుండా అడ్డుకున్న, అరికట్టిన సర్పంచులకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సర్పంచిగా అవార్డు ఇప్పిస్తానని కలెక్టర్ ప్రకటించారు.

సరిహద్దు ప్రాంతాల్లో బాల్య వివాహాలు..

ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ.. బాల్య వివాహం నేరమని, 2006లోనే చట్టం వచ్చినా.. నెలకో కేసు నమోదు కావడం దురదృష్టకరం అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో బాల్య వివాహాలు చేస్తున్నారని, ఆడపిల్లను వేరే ఇంటికి తొందరగా పంపించాలనే ఆలోచన ధోరణి తల్లిదండ్రులలో మారాలని ఎస్పీ తెలిపారు. డ్రాపవుట్ అయిన ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేస్తున్నారని, అందుకే అలాంటి వారిని గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ మిషన్ మోడ్‌లో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. బాలల సంరక్షణ సలహాదారు డేవిడ్ రాజ్ బాల్య వివాహా నిరోధక చట్టం, పోక్సో చట్టం గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో శ్రీనివాస్ రావు, డీఆర్డీవో వెంకట్ రాములు, ఆర్డీవో రమేష్, డీడబ్ల్యుఓ రాజేందర్ గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్, సీడబ్లూసీ ఛైర్మన్ అశోక్ కుమార్, డీసీపీవో కరిష్మా, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>