ఇష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలి: కలెక్టర్

కలం, నారాయణపేట: విద్యార్థులు ఇష్టపడి చదివి జీవిత లక్ష్యాన్ని సాధించాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ (Narayanpet Collector) సిహెచ్ ప్రియాంక సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ నారాయణపేట మండలంలోని జాజాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Priyanka) మాట్లాడుతూ.. నూతన విద్యా సంవత్సరం ప్రారంభంలో ముందుగా జాజాపూర్ పాఠశాలకు వచ్చానని, ఈ పాఠశాల వచ్చే సంవత్సరం పదో తరగతి లో వందశాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలవాలన్నారు. ఈ జిల్లా నుంచి గతంలో బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపిక అయ్యారని ఆమె గుర్తు చేశారు. జాజాపూర్ పాఠశాల నుంచి కూడా త్రిపుల్ ఐటీకి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.

అంతేకాదు తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని, ఇష్టంతో చదవాలన్నారు. బట్టి పట్టే విధానానికి స్వస్తి పలకాలన్నారు. లెక్కలను సులువుగా ఎలా చేయాలో విద్యార్థులకు ఆమె ప్రాక్టికల్ గా చేసి చూపించారు. విద్యార్థులకు పదో తరగతే పునాది లాంటిది అన్నారు. రాబోయే పదేళ్ల లో మీరు ఎలా ఉండాలో నోట్ బుక్ లో రాసుకుని, రోజూ దానిని చూస్తూ, అందుకు తగిన ప్రణాళిక ప్రకారం సాధన చేయాలని సలహా ఇచ్చారు. పదో తరగతిలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. అమ్మాయిలకు ఆర్థిక స్వాతంత్రం కావాలన్నారు. వచ్చే సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో టాపర్ గా నిలిచిన వారికి తన తరపున ప్రత్యేక బహుమతి ఇస్తానని కలెక్టర్ (Narayanpet Collector) ప్రకటించారు. వచ్చే సంవత్సరం టాపర్ ను తప్పని సరిగా తన వద్దకు తీసుకు రావాలని హెచ్ఎంకు సూచించారు. విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాఠశాల ప్రయోగ శాల, గ్రంథాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు.

చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన కలెక్టర్

జాజాపూర్ అంగన్ వాడిలో పూర్వ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకుని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలలో చేరిన (అంగన్ వాడీ)చిన్నారులకు జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అక్షరాభ్యాసం చేయించారు. అంతకు ముందు సరస్వతీ మాత చిత్రపటానికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి గోవింద రాజు, మండల విద్యా శాఖ అధికారి బాలాజీ, ఆయా పాఠశాలల హెచ్ ఎం లు, ఉపాధ్యాయులు, అంగన్ వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Read Also: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ముంబై తాత స్టోరీ!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>