కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగర అభివృద్ధి కోసం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గతంలోనే రూ.1400 కోట్ల నిధులు తీసుకురావడం జరిగిందని బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటి మేయర్ యాదగిరి సునీల్ రావు (Sunil Rao) అన్నారు. కరీంనగర్‌లో శుక్రవారం ఓ ప్రైవేట్ హోటల్‌లో విలేకరుల సమావేశంలో మేయర్ కొలగాని శ్రీనివాస్‌తో కలిసి మాట్లాడారు. తమ పాలకవర్గం ఏర్పడిన మూడు మాసాల్లోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ నగర అభివృద్ధికి ప్రణాళికలు వేసుకొని…ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి నిరంతర ప్రక్రియగా అభివృద్ధి కొనసాగించాలనే గొప్ప లక్ష్యంతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ స్కీంలో రూ.840 కోట్ల నిధులను మంజూరు చేయించారని తెలిపారు. గతంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టుతో పాటు అమృత్, 15వ ఆర్థిక సంఘం, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కి నిధులు తెచ్చి గత ఏడు సంవత్సరాల కాలంగా నగరాన్ని అభివృద్ధి బాట పట్టించారని తెలిపారు. ఇదే పరంపర కొనసాగలనే గొప్ప ఉద్దేశంతో మున్సిపల్ ఎన్నికల వాగ్ధానానికి కట్టిబడి పెద్ద మొత్తంలో అర్బన్ చాలెంజ్ ఫండ్ స్కీంలో నిధులు తీసుకురావడం చాలా గర్వకారణం అన్నారు.
గతంలో చాలా ప్రాంతాలను ఇప్పటికే అభివృద్ధి చేయడం జరిగిందని… గతం నుండే కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి రోజు మంచి నీటి సరఫరాను అమృత్ నిధుల ద్వారానే చేపట్టడం జరిగిందని తెలిపారు. విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల డివిజన్లకు ప్రతి రోజు మంచి నీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల డివిజన్లను నగరంతో సమాంతరంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మూడు మాసాల్లోనే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అర్బన్ చాలెంజ్ ఫండ్ స్కీంలో కరీంనగర్ నగరపాలక సంస్థను చేర్చాలని ప్రతిపాదనలు పంపించి 840 కోట్ల నిధుల మంజూరుకు కృషి చేశారని తెలిపారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ పథకానికి కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రపోజల్స్ పంపించి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తప్పకుండా 840 కోట్ల రూపాయల నిధుల నుండి 210 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుండి 210 కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటా ఇవ్వగా కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన హడ్కో మరో 420 కోట్లు వాటాగా నిధులు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఎక్కడ ఒక్క రూపాయి కూడా అప్పు లేని పరిస్థితి లో ఉందని ,అర్బన్ చాలెంజ్ ఫండ్ పథకంలో హడ్కో ద్వారా నిధులు ఇప్పించడం చాలా గొప్ప విషయం అన్నారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో ( HUDCO) ద్వారా కేంద్ర నిధులు ఇప్పించేలా చర్యలు తీస్కోని… ప్రతిపాదనలు కూడా చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడ 25 శాతం వాటాను కూడా నగర అభివృద్ధి కోసం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ వంద శాతం నిధులతో నేను, మా మేయర్, మా పాలకవర్గ సభ్యులందరం కలిసి బండి సంజయ్ కుమార్ సలహాల సూచనల మేరకు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కరీంనగర్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే గొప్ప నగరంగా మార్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. బండి సంజయ్ కుమార్ తెచ్చిన నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. నగరానికి ఈ నిధులు కేటాయించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌కు నగరపాలక సంస్థ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

