వైఎస్ఆర్సీపీపై ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ఘాటు వ్యాఖ్యలు చేశారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయం చేద్దామనుకున్న ‘బ్లూ బ్యాచ్’తో సమాజానికే ముప్పని అన్నారు. ‘‘పక్క రాష్ట్రంలో ఒక గురుకుల పాఠశాలలో 2023 నాటి పరిస్థితికి సంబంధించిన ఒక వీడియోను తాజాగా అరకు(Araku) లో జరిగినట్లు ఒక కథనం రాసి వైసీపీ అనుబంధ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఇదే వార్తపై, ఇదే వీడియో పై రాష్ట్ర ప్రభుత్వం తరపున ‘ఫ్యాక్ట్ చెక్’ లో సంపూర్ణ వివరాలతో సమాచారం అందించినా కూడా కొద్ది రోజులు ఊరుకుని మళ్లీ అదే వీడియోతో తాజాగా తప్పుడు ప్రచారం ప్రారంభించారు. ఇలా తరచూ నేరాలకు పాల్పడేవారిని ‘హ్యాబిట్యువల్ అఫెండర్స్’ (నేరాలు చేయడానికి అలవాటు పడ్డవారు) అంటారు. అందుకే అది ఒక రాజకీయ పార్టీనా హ్యాబిట్యువల్ అఫెండర్స్ ముఠానా అనే అనుమానం వస్తున్నది. ఈ ఫేక్ ప్రచారాన్ని ప్రజలు ఎవరూ కూడా నమ్మవద్దు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేవారిపై చర్యలు తీసుకోవలసిందిగా Andhra Pradesh Police వారిని కోరుతున్నాను’’ అని లోకేష్(Nara Lokesh) వ్యాఖ్యానించారు.

