కలం, వెబ్ డెస్క్: ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఢిల్లీకి బిజీబిజీగా గడుపుతున్నారు. అమరావతి రాజధాని బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందడం, రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేయడంతో కృతజ్ఞతలు తెలిపేందుకు లోకేశ్ ఢిల్లీ వెళ్లారు. సోమవారం ఉదయం ఆయన ఢిల్లీ విమనాశ్రయానికి చేరుకోగానే.. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం ఆయన కూటమికి చెందిన ఎంపీలతో సమావేశం కానున్నారు. అమరావతి రాజధాని అంశాన్ని ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని అమరావతిని రాజధానిగా ప్రకటించేలా ఒత్తిడి చేసింది. ఈ క్రమంలోనే ఈ బిల్లు లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో లోకేశ్ ఢిల్లీకి చేరుకొని వివిధ పార్టీల ఎంపీలకు ఏపీ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు చెప్పనున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలసి, అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అమరావతి అభివృద్ధి అంశంపై కేంద్రంతో సమన్వయం పెంచేందుకు ఈ ఢిల్లీ పర్యటన కీలకంగా మారుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్డీయే నేతల మద్దతుతో అమరావతి ప్రాజెక్ట్‌కు మరింత వేగం వచ్చే అవకాశం ఉందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

