కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఇందిరా మహిళా శక్తి (Indira Mahila Shakthi) కింద 400 బస్సులు అనేది మహిళలను మోసం చేయడమేనని.. అబద్ధాల పాలన ఆగం కాక తప్పదని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ (Nandimalla Ashok) మండిపడ్డారు. హిట్లర్ ను అనుసరిస్తున్న రేవంత్ రెడ్డి విధానాలు.. ఫాసిస్టు చర్యలను తలపిస్తుందని విమర్శించారు. మహిళలను కోటీశ్వరులను చేసే ప్రక్రియలో భాగంగా ఆర్టీసీ బస్సులకు, పెట్రోల్ బంకులకు యజమానులు చేస్తే అని చెప్పి నేటికి ఏ బస్సుకు, ఏ పెట్రోల్ బంకులకు యజమానులను చేశారో రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ఈరోజు 400 బస్సులు కేటాయిస్తున్నామని ఆర్భాటం చేస్తూ ప్రారంభించడాన్ని మరోసారి మహిళలను మోసం చేయడమేనని దుయ్యబట్టారు.
రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారు..
వివిధ డిపోలలో ఉన్న పాత బస్సులను కొత్తగా రంగులు వేసి రాజధానికి తరలించి నూతన బస్సులకు మహిళలను యజమానులను చేస్తున్నానని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని అశోక్ (Nandimalla Ashok) విమర్శించారు. వనపర్తి డిపోకు చెందిన బస్సులకు అలంపూర్ మహిళా సమాఖ్య అని పేర్లు స్టిక్కర్లు వేసి చూపించడం రేవంత్ రెడ్డి పాలనకు పరాకాష్ట అని విమర్శించారు . నిజంగా మహిళలకు బస్సులు కేటాయించి ఆర్థికంగా అభివృద్ధి చేయాలనుకుంటే నూతన బస్సులు కొనుగోలు చేసి వారికి కేటాయించాలన్నారు. మహిళలకు ఇచ్చిన హామీల నుండి దృష్టి మళ్లించడానికి వాగ్దానం చేసిన పథకాలు ప్రతి మహిళకు రూ.2500, తులం బంగారం,కేసీఆర్ కిట్టు, గ్యాస్ సబ్సిడీ, స్కూటీలు ఇవ్వకుండా రోజుకో అబద్ధం చెబుతూ రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామాలు మహిళలు గమనిస్తున్నారని.. సరైన సమయంలో ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.
బస్సులను ఆర్టీసీ ఆపరేటింగ్ చేస్తుందా?
మహిళా సమాఖ్య పేరిట కేటాయిస్తున్న బస్సులను ఆర్టీసీ ఆపరేటింగ్ చేస్తుందా? అందులో నుండి వచ్చే రాబడి తిరిగి సమాఖ్యకు చెల్లిస్తారా? ప్రత్యేకంగా సిబ్బందిని రిక్రూట్మెంట్ చేస్తారా? వంటి అంశాలపై స్పష్టత లేదని అశోక్ అన్నారు. ప్రతి బహిరంగ సభకు మహిళలను తరలిస్తూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ వారి విలువైన సమయాన్ని వృథా చేస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి రేవంత్ రెడ్డి ఆటంకం కలిగిస్తున్నాడని ఆరోపించారు. మహిళా ఓట్లతోనే మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చనే దుర్బుద్ధిని మహిళలు తిప్పికొట్టి కాంగ్రెస్ పాలనకు మంగళం పాడడం ఖాయమని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు నీలస్వామి, మైనార్టీ సెల్ అధ్యక్షులు జోహెబ్ హుస్సేన్, మండల యువత అధ్యక్షులు చిట్యాల రాము పాల్గొన్నారు.
Read Also: ముగ్గురిని రక్షించి మరణించిన యువకుడు.. సీఎం దిగ్భ్రాంతి
Follow Us On : WhatsApp

