కలం, నల్లగొండ బ్యూరో : జాతీయ రహదారులపై అర్ధరాత్రి ఆగి ఉన్న వాహనాలే లక్ష్యంగా డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్లగొండ (Nalgonda) జిల్లా పోలీసులు విజయవంతంగా పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా నల్గొండజిల్లా పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
అదనపు ఎస్పీ జి. రమేష్ వెల్లడించిన వివరాల ప్రకారం, చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ఒక డీసీఎం వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఆ వాహనంలో వడ్లపట్టాల వెనుక దాచిన డీజిల్ క్యాన్లను గుర్తించారు. నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాకు (Nalgonda) చెందినవారని పోలీసులు తెలిపారు. వీరు రాత్రి వేళల్లో హైవేపై నిద్రిస్తున్న డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని వారి వాహనాల డీజిల్ ట్యాంకుల నుండి ఇంధనాన్ని చాకచక్యంగా దొంగిలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటివరకు ఈ ముఠాపై తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే వీరు ఈ నేరాలకు అలవాటు పడ్డారని పేర్కొన్నారు.
ఈ ఆపరేషన్‌లో సుమారు 1000 లీటర్ల డీజిల్, రెండు డీసీఎం వాహనాలు, 6 మొబైల్ ఫోన్లు సహా మొత్తం సుమారు రూ.40 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసును ఛేదించిన డీఎస్పీ శివరాం రెడ్డి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ జితేందర్ రెడ్డి, చిట్యాల సీఐ నాగరాజు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు.
Read Also: ఫ్యూచర్ సిటీ చుట్టూ సీఎం సోదరుల భూ దోపిడీ: కేటీఆర్
Follow Us On: X(Twitter)

