కలం, నల్లగొండ బ్యూరో: ఒకవైపు పాలకుల ఉదాసీనత.. మరోవైపు మిల్లర్ల సిండికేట్ దందా.. వెరసి నల్లగొండ (Nalgonda) జిల్లా వరి రైతాంగం నిలువు దోపిడీకి బలవుతోంది. ప్రభుత్వం ప్రకటించిన కొనుగోలు కేంద్రాలు కాగితాలకే పరిమితం కావడంతో రైతులు అకాల వర్షాలకు, మిల్లర్ల అరాచకాలకు చిక్కుకుని విలవిలలాడుతున్నారు. ప్రధానంగా నల్లగొండ జిల్లాలో రైస్ మిల్లర్ల రాజ్యం నడుస్తోంది. అడిగేవారే లేకపోవడంతో ధర నిర్ణయించే అధికారం తమదే అన్నట్లుగా మిల్లర్లు రెచ్చిపోతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే క్వింటాల్‌కు రూ. 400 వరకు ధర తగ్గించి రైతులను (Paddy Farmers) దోచేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపమా? మిల్లర్లతో కుమ్మక్కయ్యారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సిండికేట్ ఏర్పడి.. రైతులను దోచేస్తూ..
ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో యాసంగి సీజన్‌లో దాదాపు 13.56 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం.. దాదాపు 32.92 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని భావించారు. ఇందులో ప్రభుత్వం 17.29 లక్షల టన్నులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 1100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా, కనీసం 10 శాతం కేంద్రాలు సైతం పూర్తిస్థాయిలో ప్రారంభానికి నోచుకోలేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సకాలంలో తెరుచుకోకపోవడం రైతులకు శాపంగా మారింది. ఇదే అదనుగా భావించిన రైస్ మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి ధరలను ఇష్టారాజ్యంగా తగ్గిస్తున్నారు. మొదట్లో క్వింటాల్‌కు రూ.2,700 నుంచి రూ.2,800 పలికిన ధరను మిల్లర్లు అకస్మాత్తుగా రూ.2,300కి తగ్గించారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రైతు క్వింటాల్‌కు రూ.300 నుంచి రూ.400 వరకు నష్టపోతుండటం గమనార్హం. ధాన్యంలో తేమ ఉందని, తాలు గింజలు ఉన్నాయనో, నల్ల గింజలు ఉన్నాయంటూ రకరకాల కొర్రీలు పెడుతూ తక్కువ ధరకు అడుగుతున్నారు.
కొనుగోళ్లు కేంద్రాల్లోనూ నిర్లక్ష్యమే
రైతులు ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్దామంటే.. అక్కడ ఎన్నిరోజులకు ధాన్యం కొనుగోలు చేస్తారో వారికే తెలియని పరిస్థితి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం.. కేంద్రాలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో రైతాంగం రైసు మిల్లుల బాటపడుతోంది. మరోవైపు అకాల వర్షాల సూచన రైతుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోస్తే.. చినుకు పడితే కనీసం వడ్ల మీద కప్పుకునేందుకు టార్ఫాలిన్ పట్టాలు సైతం ఇచ్చే పరిస్థితి లేదు. రైతులు సొంతంగా తెచ్చుకుని ధాన్యం మీద కప్పుకుని కాపాడాల్సిన పరిస్థితి. దీంతో వర్షం పడితే చేతికి వచ్చిన పంట నీటిపాలవుతుందనే భయంతో ఎంతకో కొంతకు మిల్లర్లకే అమ్ముతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు మిల్లర్లతో కుమ్మక్కయ్యారని, అందుకే దోపిడీ జరుగుతున్నా మౌనంగా ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడక్కడా తూకంలో దోపిడీ, ధరల్లో మోసం జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. నల్లగొండ జిల్లాలోని వరి రైతును ఆదుకోవాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి, మిల్లర్ల సిండికేట్‌ను అదుపు చేయాలి. లేదంటే ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి పంట పండించిన అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.
Read Also: కేబినెట్ విస్తరణ.. మంత్రి పదవి రేసులో ఆది శ్రీనివాస్!
Follow Us On: Facebook

