కేబినెట్ విస్తరణ.. మంత్రి పదవి రేసులో ఆది శ్రీనివాస్‌!

కలం, కరీంనగర్ బ్యూరో : కాంగ్రెస్ సీనియర్ నేత, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) కు మంత్రి పదవి దక్కనుందా? మంత్రి వర్గ విస్తరణ (Cabinet Expansion) లో ఆయనకు చోటు దక్కడం ఖాయమేనా? అంటే అవుననే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు మార్లు కేబినెట్‌ను విస్తరించగా ఏప్రిల్ నెలలో ముచ్చటగా మూడోసారి విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. కేబినెట్లో ఇంకా రెండు పదవులు ఖాళీగా ఉండడం, ఒకరిద్దరు మంత్రులను సైతం తప్పించబోతున్నారంటూ కథనాలు వస్తున్న నేపథ్యంలో విస్తరణలో ఎవరెవరికి అవకాశం లభిస్తుందన్న దానిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో త్వరలో జరగనున్న మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ, విస్తరణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేరు బలంగా వినిపిస్తోంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలుచుకోగా అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడంతో బలం 9 కి పెరిగింది. ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి వర్గంలో ఇప్పటికే దుద్దిళ్ల శ్రీధర్ బాబు (ఓసీ), పొన్నం ప్రభాకర్ (బీసీ), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ఎస్సీ) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే సమయంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) కు ప్రభుత్వ విప్ గా అవకాశం కల్పించగా ఇటీవలే పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుకు సైతం ప్రభుత్వ విప్ గా బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో జరగనున్న మంత్రి వర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లా నుంచి సామాజిక వర్గ కోటాలో ఆది శ్రీనివాస్ కు ఛాన్స్ దక్కే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.

ప్రభుత్వ విప్ గా ఆది శ్రీనివాస్ ఇప్పటికే తన పనితీరుతో మంచి పేరు తెచ్చుకున్నట్లే ఉన్నారు. పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠ ఇనుపడింపజేస్తూ ప్రజల పట్ల సౌమ్యుడిగా వ్యవహరిస్తూ వస్తున్న ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ప్రతి ప్రభుత్వంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇస్తున్న క్రమంలో.. రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఈ సామాజిక వర్గం నుంచి ఎవరూ లేకపోవడం ఆయనకు కలిసి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బలమైన సామాజిక వర్గం కావడంతో పెద్దపీట వేసే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని పలువురు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు వినికిడి. ముదిరాజ్, గౌడ్, పద్మశాలి వంటి బీసీ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించిన కేబినెట్ లో బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చోటు దక్కవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వైఎస్ అనుచరునిగా గుర్తింపు..

జెడ్పీటీసీ, ఎంపీపీగా ఎదిగిన ఆది శ్రీనివాస్ దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహిత అనుచరునిగా ముద్రపడ్డారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా అవకాశం దక్కించుకున్నారు. దీంతో నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువయ్యారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి చెన్నమనేని రమేష్ బాబు చేతిలో ఓటమి పాలైన ఆయన 2023 నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మంత్రి పదవి రేసులో ఉన్నా ప్రభుత్వ విప్ గా అవకాశం కల్పించారు. అయితే త్వరలో జరగనున్న మంత్రి వర్గ విస్తరణలోనైనా ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి కట్టబెట్టడం ద్వారా పార్టీ నినాదంగా నిలిచిన బిసి వాదానికి మరింత ప్రాధాన్యత పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చెన్నమనేనిపై రెండున్నర దశాబ్దాల పోరాటం..

మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుపై చేసిన న్యాయ పోరాటంలో నెగ్గడం ద్వారా ఆది శ్రీనివాస్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. 2009 నుంచి 2018 వరకు గెలుపొందుతూ వచ్చిన రమేష్ బాబు జర్మనీ దేశ పౌరసత్వం కలిగి ఉన్నారు. అయినా దానిని దాచిపెట్టి పోటీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2009 నుంచి ఆది శ్రీనివాస్ రెండున్నర దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేసి నెగ్గారు. కింది స్థాయి నుంచి సుప్రీం కోర్టు వరకు ఆది శ్రీనివాస్ చేసిన ఒంటరి పోరాటం చివరకు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫలించింది. చెన్నమనేని రమేష్ బాబు గెలుపును సుప్రీం కోర్టు తప్పుపట్టింది. ఆయనకు జరిమానా సైతం విధించింది. అయితే ఈ విషయంలో పార్టీపరంగా ఆది శ్రీనివాస్ కు అప్పటి పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో సహకారం లభించకపోయినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా చేసిన న్యాయ పోరాటంలో నెగ్గడం ద్వారా రాష్ట్రంలోనే సంచలనం సృష్టించారు. కోర్టు రమేష్ బాబు ఎన్నికను తప్పుపట్టడం.. ఆది శ్రీనివాస్ సాధించిన విజయంగా నియోజకవర్గంలో ఆయనకు మరింత మంచి పేరును తెచ్చి పెట్టింది.

Read Also: ఆర్టీసీలో సమ్మె సైరన్.. తేదీ ప్ర‌క‌టించిన జేఏసీ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>