జనగణనతోనే అభివృద్ధి సాధ్యం: నల్లగొండ కలెక్టర్

కలం, నల్లగొండ: దేశాభివృద్ధికి, భవిష్యత్తు ప్రణాళికల రచనకు మూలమైన ‘జనగణన 2027’లో భాగంగా నిర్వహించే స్వీయ గణన ప్రక్రియకు ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉందని నల్లగొండ (Nalgonda) జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్, ముఖ్య ప్రణాళిక అధికారి ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్.జి. కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు “జనగణన నడక” నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

‘ప్రజలు ఆందోళన చెందొద్దు..’

క్లాక్ టవర్ వద్ద జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ‘గత నెల 26న ప్రారంభమైన స్వీయ గణన ప్రక్రియ ఈ నెల 10తో ముగుస్తుంది. మొబైల్ ద్వారానే కేవలం 10 నిమిషాల్లో 16 భాషల్లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. స్వీయ గణన పూర్తి చేసిన వారికి ఒక ఐడీ వస్తుంది. దీని వలన 11వ తేదీ నుంచి ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు పని సులభతరమవుతుంది. అద్దె గృహాల్లో నివసించే వారు కూడా ప్రస్తుతం ఉంటున్న చోట నుంచే వివరాలు నమోదు చేసుకోవచ్చు. జనగణనలో సేకరించే సమాచారం కేవలం ప్రభుత్వ ప్రణాళికల కోసమే తప్ప ఇతర దేనికీ ఉపయోగించరు. ఎలాంటి ఆందోళన చెందకుండా కచ్చితమైన వివరాలు ఇవ్వాలి. నల్లగొండ జిల్లాలో సుమారు 20 లక్షల జనాభా, 5.50 లక్షల ఇళ్లు ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 12 వేల కుటుంబాలు మాత్రమే స్వీయ గణన చేసుకున్నాయి. మిగిలిన వారు త్వరితగతిన పూర్తి చేయాలి’ అని కలెక్టర్ కోరారు.

’10 నిమిషాలు సరిపోతుంది..’

నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధికి జనాభా లెక్కలు ఎంతో ముఖ్యమని, కేవలం 10 నిమిషాల సమయం కేటాయించి ప్రతి ఒక్కరూ స్వీయ గణనలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, సెన్సెస్ జాయింట్ డైరెక్టర్ రఘు, సీపీవో శ్రీనివాస్ నాయక్, ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, మాజీ మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>