కలం, మెదక్ బ్యూరో: కాంగ్రెస్ (Congress Govt) ప్రభుత్వం ఏర్పడి రెండేన్నరేళ్లు కావస్తున్నా మెదక్ (Medak) జిల్లాలోని అధికార పార్టీ నేతలకు మాత్రం నామినేటెడ్ పదవుల (Nominated Posts) భాగ్యం కలగడం లేదు. ప్రభుత్వం ఏర్పడి కొత్తలో ఇచ్చిన భర్తీలోనూ, తాజాగా భర్తీ చేసిన నామినేటెట్ పదవుల్లోను మెదక్ జిల్లాకు చెందిన ఒక్క కాంగ్రెస్ నాయకుడికి పదవి దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. 2023 డిసెంబర్‌లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, సుదీర్ఘ నిరీక్షణ అనంతరం జూలై 2024లో పదవుల భర్తీని చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 35 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నేతలకు కీలక పదవులు దక్కాయి, ఇందులో పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా, వైస్ ఛైర్మన్లుగా నియమితులయ్యారు. ఈ నియామకాల్లో సంగారెడ్డి జిల్లా నుండి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భార్య నిర్మలకు అత్యంత కీలకమైన టీజిఐసిసి చైర్మన్ పదవి, జహీరాబాద్ ప్రాంతానికి చెందిన గిరిధర్ రెడ్డికి సెట్విన్ సంస్ధగా చైర్మన్ గా నియమించారు.
పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అవకాశలేవి?
తాజాగా ప్రభుత్వం రాష్ట్రస్ధాయిలో పలు కార్పొరేషన్లు, వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ల చైర్మన్ల భర్తీ జరిగింది. ఈ నియామకాలలో అలస్యంగా అయినా సిద్దిపేట జిల్లా నుండి సిద్దిపేట పట్ణణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గూడురి శ్రీనివాస్‌ను పద్మాశాలీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. మరో వైపు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు చైర్మన్‌గా నియమించారు. 2024, 2026 జరిగిన రాష్ట్ర స్ధాయి నామినేటెడ్ పదవుల భర్తీలో మెదక్ జిల్లాకు మాత్రం కనీస ప్రాధాన్యత దక్కలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులకు చివరికి నిరాశే మిగిలింది. ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డికి రెండు పోస్టులు, సిద్ధిపేటకు రెండు పోస్టులు కేటాయించి మెదక్ జిల్లా నుండి ఒక్కరికి అవకాశం రాకపోవడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రోటొకాల్ సమస్య లేకుండా నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి ,రెండు సార్లు ఎమ్మెల్యే గా పని చేసి, బలమైన నాయకుడిగా పేరున్న మదన్ రెడ్డితో పాటు , మెదక్ నియోజకవర్గానికి సంబంధించి పార్టీని నమ్ముకొని ఉన్న సీనియర్ నాయకులకు నామినేటెడ్ పదవుల భర్తీ లో అవకాశం వస్తుందని భావించారు. కానీ రెండు పర్యాయలు రాష్ట్రస్ధాయి నామినేటెడ్ పదవుల భర్తీలో మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులకు చివరికి మొండిచెయ్యే మిగిలింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పదేళ్లు పార్టీ కోసం కష్టపడినా కనీస గుర్తింపు రావడం లేదని , మెదక్ జిల్లాకు సంబంధించిన ముఖ్య కాంగ్రెస్ నాయకులు పార్టీకి నమ్ముకున్న నిజమైన కార్యకర్తలను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో జిల్లా నాయకుల తరుఫున గట్టిగా అడగడంలేదని మెదక్ కాంగ్రెస్ నాయకులు గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు అయినా మెదక్ జిల్లాకు నామినేటెడ్ పదవుల్లో ప్రాతినిధ్యం లేకపొవడంతో హస్తం కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారు.

