కలం, నేషనల్ డెస్క్ : మావోయిస్టు పార్టీని పూర్తిగా తుదముట్టించామని లోక్‌సభ వేదికగా ప్రకటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆ పార్టీ అగ్రనేత గణపతి (Maoist Ganapathi) పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ కగార్ మొదలుపెట్టే నాటికి మావోయిస్టు పార్టీకి గుండెకాయగా ఉన్న సెంట్రల్ కమిటీ, పొలిట్‌బ్యూరో కమిటీల్లో 21 మంది సభ్యులుండేవారని, ఇప్పుడు ఒక్కరు మాత్రమే మిగిలారని అన్నారు. గణపతి పేరును ప్రత్యక్షంగా ఎక్కడా ప్రస్తావించకుండా త్వరలోనే ఆ ఒక్కరు కూడా లొంగిపోతారని అమిత్ షా (Amit Shah) అన్నారు. ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్ మార్చి 31తో ముగుస్తున్నందున ఆ ఒక్కరి సరెండర్‌ను చివరి రోజున చూపించే అవకాశమున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. కేంద్ర హోం మంత్రి స్వయంగా పార్లమెంటు వేదికగా ఒకే ఒక్కరు మాత్రమే పరారీలో ఉన్నారని చెప్పి త్వరలోనే లొంగిపోతారని ప్రకటించిన నేపథ్యంలో ఆ ఒక్కరు గణపతి అనే చర్చకు తావిచ్చినట్లయింది.
కేంద్రం దృష్టిలో గణపతి ఒక్కరే పరార్ :
కేంద్ర ప్రభుత్వం దగ్గరున్న రికార్డుల ప్రకారం ప్రస్తుతానికి మావోయిస్టు పార్టీలో మిగిలి ఉన్న కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు గణపతి (Maoist Ganapathi) మాత్రమే. ఆపరేషన్ కగార్ మొదలుపెట్టే సమయానికి మొత్తం 21 మంది నాయకులు ఉంటే అందులో ఒకరిని అరెస్టు చేశామని, ఏడుగురు సరెండర్ అయ్యారని, మరో 12 మంది ఎన్‌కౌంటర్లలో చనిపోయారని, ఇక మిగిలింది ఒక్కరేనని లోక్‌సభలో చర్చ సందర్భంగా అమిత్ షా వెల్లడించారు. ఆ ఒక్కరు కూడా త్వరలో లొంగిపోక తప్పదనే వ్యాఖ్యలు చేశారు. గణపతి లొంగిపోతారంటూ ఇప్పటికే వార్తలు వెలువడున్న నేపథ్యంలో స్వయంగా అమిత్ షా ఆ ఒక్కరి పేరును ప్రస్తావించకుండా త్వరలోనే లొంగుబాటు ఉంటుందంటూ కామెంట్ చేయడం గమనార్హం. ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్ ముగియడానికి ఒక రోజు ముందు అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడంతో మార్చి 31న అధికారికంగా సరెండర్‌ను చూపించే అవకాశాలపై సంకేతం ఇచ్చినట్లయింది.
Read Also: కాంట్రవర్సీ కౌశిక్.. ఫ్యూచర్ ఏంటి?
Follow Us On: Instagram

