కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ నేపథ్యంలో రైస్ మిల్లర్లకు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ (Collector Chandrasekhar) కీలక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం తన ఛాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో రైస్ మిల్లర్లు, సంబంధిత శాఖల అధికారులను కలిసి పరిస్థితిని సమీక్షించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు భారీగా రబీ ధాన్యం వస్తుండటంతో, మిల్లర్లు ఎలాంటి జాప్యం లేకుండా ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మిల్లుల వద్ద లారీలు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు.
ఇప్పటివరకు జిల్లాలో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని, మరో 15 రోజుల్లో అదే స్థాయిలో మరిన్ని నిల్వలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో మిల్లర్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ధాన్యం అన్‌లోడింగ్‌లో తాలు, లారీలు వంటి కారణాలతో ఎలాంటి కొర్రీలు విధించవద్దని, రైతుల పక్షాన నిలబడి సహకరించాలని ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి నోటిఫైడ్ లారీలను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖకు సూచనలు ఇచ్చారు. మిల్లర్ల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్ (Collector Chandrasekhar), బ్యాంక్ గ్యారెంటీ, మిల్లర్ అగ్రిమెంట్లు సమర్పించని వారు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అధిక ఉష్ణోగ్రతలు, వర్ష సూచనలను దృష్టిలో ఉంచుకుని ధాన్యం తడవకుండా ముందుగానే కొనుగోలు చేయాలని చెప్పారు.
ధాన్యం లోడింగ్ సమయంలో ఒకే వెరైటీని మాత్రమే పంపించాలని, “ఏ” గ్రేడ్ ధాన్యంతో కామన్ వెరైటీలు కలపరాదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు మిల్లులకు చేరిన ధాన్యం వివరాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం అన్‌లోడింగ్ వేగవంతం కోసం వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, పౌరసరఫరాల అధికారులు వెంకటేశం, రామ్‌పతి నాయక్, వ్యవసాయ అధికారి శ్రవణ్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Also: మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఫలించిన బీజేపీ వ్యూహం?
Follow Us On: Instagram

