నీట్ స్కామ్.. కేంద్రంపై మంత్రి లక్ష్మణ్ కుమార్ ఫైర్

కలం, జగిత్యాల: నీట్ (NEET) యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి గడ్డుకాలం మొదలైందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri) అన్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జగిత్యాల (Jagtial) జిల్లా కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో మంత్రి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నిర్వహించే నీట్ పరీక్షకు లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. ఈ ఏడాది నీట్-యూజీ పరీక్షకు 22,79,743 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 19,99,895 మంది పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. తెలంగాణ నుంచి 73,084 మంది విద్యార్థులు పరీక్ష రాశారని తెలిపారు.

ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా పలువురు విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, వారి తల్లిదండ్రుల ఆశలు ముడిపడి ఉన్న నీట్ పరీక్షను పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటించకపోవడం వల్లే ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు. లీకైన ప్రశ్నపత్రాలను సామాజిక మాధ్యమాలు, టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా భారీ మొత్తాలకు విక్రయించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయని పేర్కొన్నారు.

నీట్-యూజీ ప్రశ్నపత్రం తయారీ, అనువాద ప్రక్రియ, పరీక్షా వ్యవస్థలోని కొంతమంది వ్యక్తులు, కోచింగ్ సంస్థల నిర్వాహకులు లీకేజీలో భాగస్వాములుగా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైందని అన్నారు. వివిధ రాష్ట్రాలలో కోచింగ్ నిర్వాహకులు, లెక్చరర్లు, దళారులను అరెస్ట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రశ్నపత్రం లీకేజీపై ఆధారాలు వెలుగులోకి వచ్చినప్పటికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయడం లేదని మంత్రి ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన కేంద్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

నీట్-యూజీ లీకేజీపై పార్లమెంటులో చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదని విమర్శించారు. విద్యార్థుల ఆందోళనలను అణచివేసేందుకు లాఠీచార్జీలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం కావాలనే దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ఎన్టీఏ పరీక్ష విధానాలలో సమూల మార్పులు తీసుకురావాలని, లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై పార్లమెంటులో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>